గ్రేహౌండ్స్‌ పోలీసుల అత్యాచార కేసు..

9 Mar, 2018 10:27 IST|Sakshi

బాధితుల తరఫున వాదించేందుకు న్యాయవాదుల జాబితా

ఏడుగురిలో ముగ్గురి పేర్లను ఎంపిక చేసి చెప్పాలని బాధిత మహిళలకు ఆదేశం

విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: విశాఖ జిల్లా వాకపల్లిలో గిరిజన మహిళలపై గ్రేహౌండ్స్‌ పోలీసులు అత్యాచారం చేశారన్న ఆరోపణల కేసులో బాధితుల తరఫున వాదించే నిమిత్తం ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల కోసం ఎంపిక చేసిన న్యాయవాదుల జాబితా గురువారం హైకోర్టుకు అందింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ సిద్ధం చేసిన జాబితాలో క్రిమినల్‌ కేసుల విచారణలో బాగా అనుభవం ఉన్న హైకోర్టు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, విశాఖలో ప్రాక్టీస్‌ చేస్తున్న కేవీ రామమూర్తి, డి.శ్రీనివాస్‌రెడ్డి (ఒంగోలు) సుంకర రాజేంద్రప్రసాద్‌ (విజయవాడ), జీఎం విజయకుమార్‌ (సికింద్రాబాద్‌) హైదరాబాద్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న ఈ.ఉమామహేశ్వరరావు, వి.సురేంద్రరావుల పేర్లు జాబితాలో ఉన్నాయి. జాబితాను గురువారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం పరిశీలించింది.

ఏడు పేర్లతో ఉన్న జాబితాలోని వారిని ప్రాధాన్యత క్రమంలో సంప్రదించి వారిలో అంగీకారం తెలిపిన ముగ్గురి పేర్లను తమకు తెలియజేయాలని బాధిత గిరిజన మహిళల తరఫు న్యాయవాది వసుదా నాగరాజ్‌కు ధర్మాసనం సూచన చేసింది. విచారణ శుక్రవారం (నేడు) వాయిదా పడింది. 2007లో కూబింగ్‌కు వచ్చిన గ్రేహౌండ్స్‌ పోలీసులు తమపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ గిరిజన మహిళలు దాఖలు చేసిన కేసు విశాఖ జిల్లా ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక కేసుల విచారణ కోర్టులో ఉంది. పౌరహక్కుల ఉద్యమ నేత పల్లా త్రినాథరావును తమ తరఫున వాదించేందుకు నియమించాలని బాధితుల అభ్యర్థనను సింగిల్‌ జడ్జి ఆమోదించారు. దీనిపై ప్రభుత్వం అప్పీల్‌ చేయడంతో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నియామకం కోసం ధర్మాసనం కసరత్తు చేసే క్రమంలో ఏడుగురి పేర్ల జాబితాను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ సమర్పించారు. విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు