కాబోయే భార్యపై బ్లేడుతో దాడి

28 Feb, 2020 11:24 IST|Sakshi
సుస్మితా ఖొరా, బాధిత యువతి ఇంటి ముందు విశ్వనాథ్‌

బ్లేడుతో గొంతు కోసిన యువకుడు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి

కొరాపుట్‌ జిల్లాలోని పొట్టంగి సమితిలో ఘటన

ఒడిశా, జయపురం: కాబోయే భార్యపై ఓ యువకుడు దాడికి పాల్పడిన సంఘటన కొరాపుట్‌ జిల్లాలోని పొట్టంగి సమితిలో ఉన్న చింతలగుడ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.వివరాలిలా ఉన్నాయి.. చింతలగుడ గ్రామానికి చెందిన డుమురి ఖొరా కూతురు సుస్మితా ఖొరాతో సొంబయి గ్రామానికి చెందిన విశ్వనాథ్‌ గుంటతో గతేడాది వివాహం నిశ్చయమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వారిద్దరికీ వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. అయితే వివాహం నిశ్చయమైనప్పటి నుంచి ఇప్పటివరకు కాబోయే అత్తవారింటికి తరచూ విశ్వనాథ్‌ వస్తూ పోతుండేవాడు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం అత్తవారింటిని చేరుకున్న విశ్వనాథ్‌ ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. సుస్మితా, విశ్వనాథ్‌లు కాసేపు సరదాగా మాట్లాడుకుని, పడుకున్నారు.

ఈ క్రమంలో అంతా పడుకున్న తర్వాత సుస్మితా గొంతును బ్లేడుతో కోసేందుకు విశ్వనాథ్‌ ప్రయత్నించాడు. దీంతో నిద్రలో నుంచి ఒక్కసారిగా ఉలికిపడి లేచిన ఆ యువతి భయంతో కేకలు వేసింది. అప్పటికే దాడికి గురైన యువతి గొంతు నుంచి రక్తం ధారలై కారుతుండగా భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు యువతిని పుకాలీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం సుస్మితాను హత్య చేసేందుకు విశ్వనాథ్‌ ప్రయత్నించాడన్న బాధిత యువతి తండ్రి ఆరోపణ మేరకు పొట్టంగి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని, అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇదే విషయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా