పెనుగుదురులో యువకుడి దారుణహత్య

23 May, 2019 06:45 IST|Sakshi
హత్యగురైన సూర్యనారాయణ వివాహమైన రోజుఫోటో

మృతుడిది కరప గ్రామం

మృతదేహం వద్ద లభ్యం కాని ఆధారాలు

కేసు నమోదు చేసిన పోలీసులు

అతడు ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌.. ఏ విధమైన చెడు అలవాట్లు లేవు. కాలేజీ లేకపోతే పొలం పనులు చేసుకోవడం, పశువులను చూసుకోవడం తప్ప వేరే ధ్యాస కూడా ఉండదు. వారం రోజుల క్రితమే అతడికి వివాహమైంది. ఆ నవవరుడు హత్యకు గురయ్యాడు. కారణమేంటో తెలియదు కానీ ఓ పొలం గట్టు వద్ద శవమై కనిపించాడు. కరప మండలం పెనుగుదురు వద్ద మంగళవారం రాత్రి ఈ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. కరప గ్రామానికి చెందిన పేకేటి సూర్యనారాయణ హత్య ఆ గ్రామంలో కలకలం రేపింది. మంగళవాయిద్యాలు మోగిన నవవరుడు, వధువు గృహాలు బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. ఎటువంటి చెడు అలవాట్లు లేని వ్యక్తి ఇలా హత్యకు గురయ్యాడంటే నమ్మలేకపోతున్నామని ఆ గ్రామస్తులు అంటున్నారు.

కరప (కాకినాడరూరల్‌): కరప గ్రామానికి చెందిన పేకేటి రాముడుకు నలుగురు కుమారులు. ఆఖరి వాడైన సూర్యనారాయణ(30) మండపేట శ్రీవికాస కాలేజీలో మ్యాథ్స్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 15న కరప శివారు పేపకాయలపాలెం గ్రామానికి చెందిన మద్దూరి వెంకటేశ్వరరావు అనే బాషా కుమార్తె నాగలక్ష్మితో అతడికి వివాహమైంది. మంగళవారం సాయంత్రం సూర్యనారాయణ తమ ఇంటి వద్ద పశువులకు నీరుపెట్టి, గడ్డివేశాడు. ఇంటి వద్ద చెప్పి అత్తారింటికి సాయంత్రం నాలుగు గంటల సమయంలో బయల్దేరి పేపకాయలపాలెం వెళ్లాడు. అక్కడ 5.30 గంటల వరకు ఉండి, ఐదుగురు స్నేహితులు పార్టీ ఇమ్మంటున్నారు, భోజనం టైంకు వచ్చేస్తానని భార్య నాగలక్ష్మితో చెప్పి, మోటారు సైకిల్‌పై వచ్చేశాడు. రాత్రి 7.30 గంటలకు కూడా రాకపోయేసరికి భార్య ఫోన్‌ చేస్తే అరగంటలో వస్తానని చెప్పాడు. రాత్రి తొమ్మిది గంటలకు కూడా రాకపోయే సరికి ఫోన్‌ చేస్తే సూర్యనారాయణ సెల్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన సూర్యనారాయణ మామ బాషా కరప ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. రాత్రి నుంచి సూర్యనారాయణ సోదరులు, బంధువులతో కలిసి పరిసర ప్రాంతాల్లో గాలించి, స్నేహితులకు ఫోన్‌ చేసినా తెలియదని సమాధానం వచ్చింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో కరప నుంచి పెనుగుదురు వైపు మోటార్‌సైకిల్‌పై వెళుతున్నట్టు చూశామని గ్రామస్తులు అంటున్నారు. బుధవారం ఉదయానికి కూడా రాకపోయేసరికి కరప పోలీసుస్టేషన్‌ కెళ్లి సూర్యనారాయణ అదృశ్యంపై  ఫిర్యాదుచేశారు.

పెనుగుదురు సమీపంలో..
బుధవారం ఉదయం 10 గంటల సమయంలో పెనుగుదురు సమీపంలో గొల్లపాలెం రోడ్డులోని లేఅవుట్‌ వద్ద మోటార్‌సైకిల్‌ ఉండడాన్ని గమనించి, అక్కడ పరిశీలించగా పొలంలో గట్టును ఆనుకుని గడ్డి కప్పి, సూర్యనారాయణ మృతదేహం కనిపించింది. వెంటనే కరప పోలీసులకు సమాచారం అందించారు. కరప ఎస్సై జి.అప్పలరాజు, రైటర్‌ ఎన్‌.వెంకటరమణ, గొల్లపాలెం, ఇంద్రపాలెం ఎస్సైలు, సిబ్బందితో కలిస ఘటనాస్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించి, హత్య గురించి సీఐకు సమాచారం ఇచ్చారు. కాకినాడరూరల్‌ సీఐ పి.ఈశ్వరుడు ఘటనా స్థలానికి వచ్చి, జరిగిన హత్యపై ఆరాతీశారు. హత్యకు ఆధారాలు దొరుకుతాయేమోనని కాకినాడ నుంచి డాగ్‌స్క్వా డ్‌ను పిలిపించారు. డాగ్‌ పరిసర ప్రాంతాల్లో కొంతదూరం తిరిగినా ఆధారాలు ఏమీ దొరకలేదు. చేతికి ఉన్న బంగారు ఉంగరాలు, జేబులో మనీపర్స్‌ అలాగే ఉన్నాయి. మెడలో ఉండే బంగారు చైన్లు, చేతికి ఉండే బ్రేస్‌లెట్‌ కనిపించలేదు. బంగారం కోసం జరిగిన హత్య కాదని, దీని వెనుక బలమైన కారణమే ఉంటుందని, దర్యాప్తులో అన్నీ తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.

పెనుగుదురు పొలాల్లో ఉన్న సూర్యనారాయణ మృతదేహాన్ని పరిశీలిస్తున్న కాకినాడ రూరల్‌ సీఐ ఈశ్వరుడు
హత్య మిస్టరీని ఛేదిస్తాం
కరప గ్రామానికి చెందిన పేకేటి సూర్యనారాయణ వివాహమైన వారానికే హత్య గురయ్యాడంటే విచారణ జరిపి, దీనివెనుక ఉన్న మిస్టరీని ఛేదిస్తామని కాకినాడ రూరల్‌ సీఐ ఈశ్వరుడు తెలిపారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే హత్య జరిగి ఉండవచ్చన్నారు. తలపై గొడ్డలి, కత్తితో నరికి ఉండొచ్చన్నారు. లే అవుట్‌లో హత్య చేసి, మృతదేహాన్ని గట్టుపక్కన పడేసి, గడ్డికప్పి పోయారన్నారు. ప్రస్తుతానికి హత్యకు సంబంధించి ఆధారాలేమీ దొరకలేదన్నారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి, నేరస్తులను పట్టుకుంటామని సీఐ ఈశ్వరుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి, హత్య కేసు నమోదుచేశారు.

మరిన్ని వార్తలు