తెల్లారితే పెళ్లి.. మరో యువతితో వరుడు..

22 Nov, 2019 12:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: తెల్లారితే పెళ్ళి పీటలెక్కాల్సిన వరుడు అంతకుముందే మరో యువతిని పెళ్లి చేసుకొని ఉడాయించాడు. దీంతో నిందితుడిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజమండ్రికి చెందిన వెంకట దుర్గాప్రసాద్‌(29) యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి అద్దెకుంటున్నాడు. అమ్మాయిలను మాటలతో మభ్యపెట్టి ప్రేమలోకి దింపుతూ కాలం గడుపుతున్నాడు. నాలుగేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో నివసిస్తున్న యువతి(24)తో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆమె ప్రేమిస్తూ వచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఆ యువతి తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమించిన యువకుడితో పెళ్లి కుదుర్చుకుంది. ఇందుకుగాను 20 రోజుల క్రితం నిశ్చితార్థం చేశారు. ఈ నెల 22వ తేదీన పెళ్లి​జరగాల్సి ఉంది. రూ.3 లక్షలు కట్నం కూడా ఇచ్చారు. తీరా తెల్లారి పెళ్లి అనగా వెంకట దుర్గాప్రసాద్‌ అసలు రంగు బయటపడింది. ఆరు నెలలుగా మరో యువతితో ప్రేమలో పడ్డాడని ఆమెతోనే పది రోజుల క్రితం పెళ్లి జరిగిందని తెలుసుకొని బాధిత యువతి ఖంగుతినింది. దీంతో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పరారీలో ఉన్న దుర్గా ప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి  కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా