ట్రాప్‌ చేసి.. బార్‌ ఎదుట 30 సార్లు పొడిచి

22 Jan, 2020 10:56 IST|Sakshi

థానే: మహిళను ఎరగా వేసి.. ఆపై బార్‌కు రప్పించి ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఉల్హాస్‌నగర్‌లోని ఓ బార్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దీపక్‌ బోయిర్‌ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మనేర్‌ గ్రామంలో నివసిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం దీపక్‌, నరేశ్‌ చావన్‌ అనే వ్యక్తితో గొడవ పడ్డాడు. ఓ మహిళ విషయంలో వారిద్దరూ పోట్లాటకు దిగారు. ఇది మనసులో పెట్టుకున్న చావన్‌ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకోసం అతన్ని బార్‌కు రప్పించాలని ప్లాన్‌ వేశాడు. అందులో భాగంగా ఓ మహిళ పేరుతో దీపక్‌కు కాల్‌ చేసి బార్‌కు రావాలని కోరాడు.

ట్రాప్‌ చేసి బార్‌కు రప్పించి..
దీంతో ట్రాప్‌లో చిక్కుకున్న దీపక్‌, అతని స్నేహితుడిని తీసుకుని మంగళవారం ఉదయం 1.30కు స్థానిక డ్యాన్స్‌ బార్‌కు వెళ్లాడు. అనంతరం కాసేపటికే బార్‌ బయటికి వచ్చాడు. అయితే అక్కడే కాచుకుని ఉన్న చావన్‌, ఐదుగురు అనుచరులతో కలిసి వారిని చుట్టుముట్టారు. కత్తులు, తుపాకీలు తీసి వారిపై దాడికి యత్నించారు. దీంతో దీపక్‌, అతని స్నేహితుడు వారి నుంచి తప్పించుకునేందుకు పరుగు అందుకున్నారు. కానీ దీపక్‌ మధ్యలో జారి కింద పడటంతో దుండగులు దీపక్‌పై కత్తితో దాడి చేశారు. చాతీ, పొట్ట, వీపు ప్రాంతాల్లో 30 సార్లు కిరాతకంగా పొడిచి చంపారు.

పాత కక్షలతోనే హత్య!
ఈ విషయాన్ని దీపక్‌ స్నేహితుడు, అతని కుటుంబ సభ్యులకు చేరవేయగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీపక్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డు అవడంతో, దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే చావన్‌.. దీపక్‌ను హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు దొరికిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా