జీఆర్‌పీ ఎస్సై అరెస్టు

20 Apr, 2018 07:53 IST|Sakshi
రాజేంద్రకుమార్‌ ముండాను కోర్టుకుతరలిస్తున్న జీఆర్‌పీ సిబ్బంది

టీటీఈపై దాడి కేసులో..

బెయిల్‌ తిరస్కరించిన కోర్టు

బరంపురం : విల్లుపురం సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో టీటీఈగా  విధులు నిర్వహిస్తున్న బి.కిరణ్‌ సాగర్‌పై బరంపురం రైల్వే స్టేషన్‌లో దాడి చేసి గాయపరిచిన కేసులో బరంపురం జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై రాజేంద్ర కుమార్‌ ముండా అరెస్టయ్యారు. వివరాలిలా ఉన్నాయి. 17వ తేదీ రాత్రి విల్లుపురం సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఖుర్దా నుంచి టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న బరంపురం జీఆర్‌పీ స్టేషన్‌ ఎస్సై   రాజేంద్ర కుమార్‌ ముండాను బి–1 కోచ్‌లో టీటీఈగా విధులు నిర్వహిస్తున్న బి.కిరణ్‌ సాగర్‌  టికెట్‌ అడగడంతో వాగ్వాదం జరిగింది. బరంపురం రైల్వేస్టేషన్‌ రాగానే  బి.కిరణ్‌ సాగర్‌ను జీఆర్‌పీ ఎస్సై, ఇతర జీఆర్‌పీ సిబ్బంది   దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బాధితుడు బి.కిరణ్‌ సాగర్‌ విశాఖపట్నం జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ఏడీజీ జీఆర్‌పీ బరంపురం పోలీస్‌స్టేషన్‌ ఐఐసీ రాజేంద్ర కుమార్‌ ముండాపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అనంతరం ఈ కేసును బరంపురం జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయడంతో గురువారం బరంపురం జీఆర్‌పీ పోలీసులు ఎస్సై రాజేంద్ర కుమార్‌ ముండాను ఆరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ఎస్సై రాజేంద్ర కుమార్‌ ముండా పెట్టుకున్న బెయిల్‌ను ఎస్‌డీజేఎం కోర్టు తిరస్కరించింది.

మరిన్ని వార్తలు