ఇక విస్తృతంగా సారా దాడులు

7 Mar, 2018 09:45 IST|Sakshi
ఎక్సైజ్‌ అనకాపల్లి సూపరింటెండెంట్‌ సుకేశ్‌

49  సారా ప్రభావిత గ్రామాల  గుర్తింపు

ఐదు కేటగిరీలుగా విభజన

వారానికి ఒకసారి  దాడులు

ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అనకాపల్లి

సూపరింటెండెంట్‌  సుకేశ్‌  

పాడేరురూరల్‌: ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు   జిల్లాలో విస్తృతంగా సారా దాడులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్టు ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అనకాపల్లి సూపరింటెండెంట్‌ ఎస్‌.సుకేశ్‌ తెలిపారు. మంగళవారం ఆయన పాడేరు ఎక్సైజ్‌ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. సారా ప్రభావిత గ్రామాలను ఐదు కేటగిరీలుగా విభజించినట్టు చెప్పారు. ఒకే గ్రామంలో సారా తయారీ, అమ్మకాలు జరిగితే కేటగిరీ –1 కింద, ఒక గ్రామంలో తయారు చేసిన సారాను వేరే గ్రామంలో అమ్మకాలు చేస్తే కేటగిరి– 2, ఒక గ్రామంలో తయారైన సారా జిల్లా అంతటా అమ్మకాలు చేస్తే కేటగిరి– 3, జిల్లాలో తయారైన సారా ఇతర జిల్లాల్లో విక్రయిస్తే కేటగిరి– 4 , రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు సారా క్రయవిక్రయాలు జరిగితే కేటగిరి– 5గా విభజించామన్నారు. జిల్లాలో కేటగిరీ ఒకటి జాబితాలో 11 గ్రామాలు, కేటగిరీ రెండులో 30 గ్రామాలు, కేటగిరీ 5 లో 8 గ్రామాలు ఉన్నాయని,  మొత్తం మీద జిల్లాలో 49 గ్రామాలను సారా ప్రభావిత గ్రామాలుగా గుర్తించామన్నారు. ఆయా గ్రామాల్లో వారానికి ఒకసారి జిల్లాలో  16 ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహిస్తామన్నారు.

రెండు గ్రామాల్లో సారాదాడులు..
తాము రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం మంగళవారం పాడేరు మండలం గురుపల్లి, హుకుంపేట మండలం ఉప్ప గ్రామాల్లో సారాదాడులు నిర్వహించినట్టు చెప్పారు. గురుపల్లిలో 2,700 లీటర్ల బెల్లంపులుపు ధ్వంసం చేశామని, ఉప్ప గ్రామంలో 900 లీటర్ల బెల్లంపులుపును ధ్వంసం చేసి, 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే సారా తయారీకి ఉపయోగించే 432 కేజీల నల్లబెల్లాన్ని స్వా«ధీనం చేసుకున్నామన్నారు. ఈరెండు చోట్ల నాలుగు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ దాడుల్లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మొబైల్‌ పార్టీకి చెందిన 80 మంది సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు.   

మరిన్ని వార్తలు