క్రైమ్‌కో సిమ్‌!

10 Nov, 2017 11:33 IST|Sakshi

రూటు మార్చిన సైబర్‌ నేరగాళ్లు

బ్యాంకుల నుంచి ఫోన్లు చేస్తారు. డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల వివరాలను పక్కాగా చెబుతారు.  ఓటీపీ సైతం సంగ్రహించి ఖాతాలోని సొమ్మును కొట్టేస్తారు. ఈ మోసాల్లో ముందుండే ‘జమ్‌తారా’ నేరగాళ్లు మరింత తెలివి మీరారు. ఒక్కో నేరానికి ఒక్కో సిమ్‌కార్డు, సెల్‌ఫోన్‌ను వాడుతున్నారు. తమ ‘పని’ కాగానే వాటిని ధ్వంసం చేస్తున్నారు. సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో నమోదైన నేరాల్లో నిందితుల కోసం ఇన్‌స్పెక్టర్‌ వీపీ తివారి ఇటీవల జమ్‌తారాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడి నేరగాళ్ల కొత్త పంథా వెలుగులోకి వచ్చింది.

సాక్షి, సిటీబ్యూరో: జార్ఖండ్‌ రాష్ట్రంలోని జమ్‌తారా జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాల్లోని యువతకు సైబర్‌ నేరాలే ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడి యువత ఇంట్లో కూర్చునే ల్యాప్‌టాప్స్, సెల్‌ఫోన్లతో దేశ వ్యాప్తంగా అనేక మందికి గాలం వేస్తుంటారు. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి, కాల్‌ సెంటర్లలో పనిచేసి వచ్చిన జమ్‌తారా యువత గ్రామాల్లో సొంతంగా ‘కాల్‌ సెంటర్లను’ ఏర్పాటు చేసుకుని ఈ సైబర్‌ నేరాలకు పాల్పడుతోంది. జమ్‌తారాలోని కొందరు వ్యక్తులు.. ఫోన్లలో ఎదుటి వారితో మాట్లాడటం ఎలా? అనే అంశంపై యువతకు శిక్షణ కూడా ఇస్తుంటారు.

‘బ్యాంకుల’ నుంచే అందుతున్న డేటా
ఆయా బ్యాంకుల్లో కింది స్థాయి, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో పాటు వాటి కాల్‌ సెంటర్లు వంటి మార్గాల్లో డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల డేటా ఈ సైబర్‌ నేరగాళ్లకు చేరుతోంది. బోగస్‌ పేర్లు, చిరునామాలతో సిమ్‌కార్డ్స్‌ తీసుకునే జమ్‌తారా యువత వీటిని వినియోగించడానికి బేసిక్‌ మోడల్, తక్కువ ఖరీదు సెల్‌ఫోన్లు వాడుతుంటారు. వీటితో తమ డేటాలోని బ్యాంకు కస్టమర్ల ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేస్తుంటారు. ఇటీవల చాలామంది ఫోన్లలో ‘ట్రూకాలర్‌’ వంటివి వాడుతుండడంతో అవతలివారి వివరాలు తెలిసిపోతోంది. దీంతో బోగస్‌ సిమ్‌కార్డుల్ని వినియోగిస్తున్న జమ్‌తారా యువత.. ముందుగానే ఆ నంబర్లను సదరు యాప్‌లో ‘బ్యాంక్‌ హెడ్‌–ఆఫీస్‌’ పేరుతో రిజిస్టర్‌ చేస్తున్నారు. ఫలితంగా ఈ నంబర్‌ నుంచి వచ్చిన కాల్‌ను రిసీవ్‌ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్నట్టు భావించి వలలో పడుతున్నారు. ఇలా ఓ వ్యక్తి నుంచి డబ్బు కాజేసిన వెంటనే జమ్‌తారా సైబర్‌ నేరగాళ్లు అందుకు వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డును ధ్వంసం చేస్తున్నారు. 

దర్యాప్తులో ఎన్నో సవాళ్లు..
క్రెడిట్, డెబిట్‌ కార్డులున్న వారికి ఫోన్లు చేసే ఈ నేరగాళ్లు ముందుగా ఫోన్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి పేరు, ఏ బ్యాంకు కార్డు వినియోగిస్తున్నారో చెప్పి.. బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు. డెబిట్‌ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్‌ కార్డు వివరాలు అప్‌డేట్‌ చెయ్యాలనో చెబుతుంటారు. ఓటీపీ సహా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత వారి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ డేటా ఆధారంగా క్లోన్డ్‌ క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులు సైతం తయారు చేసి డ్రా చేసుకుంటున్నట్టు వెలుగులోకి వచ్చింది. వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలన్నీ తప్పుడు వివరాలతో ఉంటున్నాయని సైబర్‌ క్రైమ్‌ అధికారులు చెప్తున్నారు. జమ్‌తారాలో ఒక్కో సెల్‌టవర్‌ పరిధి దాదాపు 25 కి.మీ. విస్తరించి ఉంటోంది. ఈ నేపథ్యంలోనే అక్కడకు వెళ్లి సాంకేతికంగా దర్యాప్తు చేయడం సైతం పెను సవాలుగా మారుతోందని అధికారులు అంటున్నారు. 

ఆ ఊరంతా కలిసికట్టుగా..
సైబర్‌ నేరాల ద్వారా వస్తున్న ‘ఆదాయాన్ని’ జమ్‌తారా సైబర్‌ నేరగాళ్లు వ్యక్తిగతంగాను, గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విషయం తెలిసినప్పటికీ ఊరంతా కలిసి కట్టుగా ఉండడంతో పాటు ప్రతి ఒక్కరూ నేరాల బాటపట్టేలా ప్రోత్సహిస్తుంటారట. బయటి నుంచి ఎవరైనా పోలీసులు వచ్చి అక్కడి వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తే.. గ్రామం మొత్తం అడ్డుకోవడంతో పాటు దాడులకూ వెనుకాడదు. స్థానిక పోలీసులు సైతం శాంతి భద్రతల సమస్యలు వస్తాయంటూ అరెస్టులకు పూర్తి స్థాయిలో సహకరించరు. దీంతో వీరి నుంచి రికవరీలు సాధ్యం కావట్లేదని అధికారులు చెబుతున్నారు.

బ్యాంకులు ఫోన్లు చేయవు
ఈ తరహా సైబర్‌ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... కేసుల్ని కొలిక్కి తీసుకురావడం, రికవరీలు చేయడం అంత కష్టం. ఆధార్‌ లింకేజ్‌ లేదా అప్‌గ్రేడ్‌ కోసం ఏ బ్యాంకు ఫోన్లు చేయదు. పేపర్లో ప్రకటన ఇవ్వడం, వ్యక్తిగతంగా బ్యాంకునకు రమ్మని కోరతాయి తప్ప ఫోన్‌ ద్వారా రహస్య వివరాలు అడగవు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలి.
– విజయ్‌ ప్రకాష్‌ తివారి, సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్, సీసీఎస్‌ 

>
మరిన్ని వార్తలు