సంచలన హత్యకేసులో బీజేపీకి షాక్‌

6 Jul, 2019 19:15 IST|Sakshi

ఆర్టీఐ కార్యకర్త హత్యకేసులో  ఏడుగుర్ని దోషులుగా తేల్చిన సీబీఐ స్పెషల్‌ కోర్టు

బీజేపీ మాజీఎంపీ దిను బోఘా సోలంకి  సహా మరో ఆరుగురు

జూలై 11న  శిక్షలు ఖరారు 

ఆర్టీఐ కార్యకర్త హత్య కేసులో  బీజేపీకి గుజరాత్‌లో భారీ షాక్‌ తగిలింది. సంచలనాత్మక హత్య కేసులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ ఎంపీ, మైనింగ్‌ మాఫియా దిను బోఘా సోలంకితో పాటు మరో ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. అనేక మలుపులు తరువాత ఈ కేసులో సంచలన తీర్పు వెలువడింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక న్యాయమూర్తి కెఎం డేవ్‌ శనివారం ఈ తీర్పును వెలువరించారు.  ఈ నెల (జూలై) 11న వీరికి శిక్షలను ఖరారు చేయనున్నారు. దోషుల్లో దిను సోలంకి మేనల్లుడు శివ సోలంకి, శైలేష్ పాండ్యా(షూటర్) తోపాటు బహదూర్‌సింగ్ వాధర్, పంచన్ జి దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉదాజీ ఠాకూర్ ఉన్నారు.

పులుల సంరక్షణా కేంద్రం గిర్‌ అడవుల్లో అక్రమ తవ్వకాలపై ప్రశ్నించినందుకు  ఆర్టీఐ కార్యకర్త అమిత్ జేత్వా  హత్యకు గురయ్యారు. జూలై 20, 2010న గుజరాత్ హైకోర్టు ఆవరణలో ఇద్దరు దుండగులు అమిత్‌ను  దారుణంగా కాల్చి చంపారు.  ఈ హత్య కేసులో కీలక కుట్రదారుడిగా సోలంకిపై సీబీఐ అభియోగాలు మోపింది. గిర్ అడవిలోని నిషేధిత ప్రాంతాలలో సోలంకి అక్రమ మైనింగ్ కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చినందున అమిత్‌ను కిరాయి గుండాలతో హత్య చేయించినట్టుగా సీబీఐ ఆరోపించింది. 2013లో సోలంకిని అరెస్ట్‌ చేసిన సీబీఐ అమిత్‌ హత్య కేసులో కీలక కుట్రదారుడిగా వాదించింది. ప్రధానంగా నిందితుల కాల్ డేటా రికార్డ్స్‌ (సిడిఆర్) ఆధారంగా వీరిని నేరస్తులుగా పేర్కొంటూ చార్జ్‌షీటు దాఖలు చేసింది.  

కాగా ఈ హత్య కేసును మొదట అహ్మదాబాద్ డిటెక్షన్ క్రైమ్ బ్రాంచ్ (డిసిబి) విచారించింది. కానీ నిందితులందరికీ డీసీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే విచారణ సమయంలో 195మంది సాక్షుల్లో 105 మంది సోలంకి బెదిరింపులకు లొంగిపోయారనీ, సీబీఐ దర్యాప్తు కోరుతూ అమిత జెత్వా తండ్రి భిఖాభాయ్ జెత్వా గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ తరువాత కేసు మరో మలుపు తిరిగింది. అనూహ్యంగా విచారణను నిలిపి వేసింది కోర్టు. కానీ  సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని  అసాధారణ ఆదేశాలిచ్చింది. ఈ  కేసును పునిర్విచారణ చేయాలని స్పెషల్‌ కోర్టును కోరింది. అంతేకాదు న్యాయమూర్తి దినేష్‌ ఎల్‌ పటేను  మార్చాలని కూడా ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా తీర్పు వెలువడింది. 

మరిన్ని వార్తలు