పగలు రెక్కీ... అర్ధరాత్రి చోరీలు

22 Jan, 2019 09:54 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

2017 డిసెంబర్‌ నుంచి  ఆరునెలల్లో ఎనిమిది ఇళ్లలో చోరీలు

ఇద్దరు చెడ్డీ గ్యాంగ్‌ సభ్యుల అరెస్టు  

రెండు వారాల పాటు గుజరాత్‌లోనే ఉండి ట్రాన్సిట్‌ వారంట్‌పై సిటీకి తీసుకొచ్చిన సిబ్బంది

సాక్షి, సిటీబ్యూరో: పగలు రెక్కీలు నిర్వహించి అర్ధరాత్రి ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న గుజరాత్‌ రాష్ట్రాని కి చెందిన ఇద్దరు చెడ్డీ గ్యాంగ్‌ ముఠా సభ్యులను మాదాపూర్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌(ఎస్‌వోటీ) పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని దహోడా జిల్లా, జేసవాడ థానా ప్రాంతానికి చెందిన హసన్‌ నార్సింగ్, రాజు సవ్‌సింగ్‌ బరియా అనే వ్యక్తులను అతికష్టంపై అరెస్టు చేసిన పోలీసులు సోమవారం ట్రాన్సిట్‌ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. ఇందుకుగాను దాదాపు రెం డు వారాల పాటు అక్కడే మకాం వేయాల్సి వచ్చింది. ఈ  గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి, ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ దయానందరెడ్డితో కలిసి పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు.  

రెండు వారాల పాటు గుజరాత్‌లోనే...
గుజరాత్‌లోని దహోడా జిల్లా, మట్కా గ్రామానికి చెందిన హసన్‌ నర్సింగ్, వినోద్, పంకజ్, చర్చోడా గ్రామానికి చెందిన రాజు సవ్‌సింగ్‌ బరియా, జేసమ్‌ దినసరి కూలీలుగా పనిచేసేవారు. కుటుంబపోషణకు ఆదాయం సరిపోకపోవడంతో చోరీలకు పాల్పడుతున్నారు. రైళ్లలో హైదరాబాద్, తదితర నగరాలకు వచ్చే వీరు రైల్వే స్టేషన్లు, సమీపంలోని మురికివాడల్లో ఉంటూ పగటిపూట కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తి స్తారు. రాత్రి వేళల్లో తాము గుర్తించిన ఇంటి సమీపంలోని  పొదల్లో అర్ధరాత్రి వరకు మాటు వేస్తారు. అనంతరం చొక్కాలు, పాయింట్లు విప్పేసి నడుముకు కట్టుకొని చెప్పులు చేతుల్లో పట్టుకొని గోడలు దూకి ఇళ్లలోకి చొరబడతారు. చోరీ అనంతరం మళ్లీ అవే పొదల్లోకి వచ్చి తెల్లవారుజాము వరకు అక్కడే వేచి ఉండి అదను చూసుకుని అక్కడి నుంచి జారుకుంటారు. ఈ తరహాలో 2017 డిసెంబర్‌ 4న, 2018 ఏప్రిల్‌ 16న, ఏప్రిల్‌ 16న, 2019 జనవరి 1న కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలోని ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు.

జనవరి 6న పుప్పలగూడ గ్రామంలో చోరీలకు తెగబడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మాదాపూర్‌ ఎస్‌వోటీ బృందం  సంఘటనాస్థలంలో దొరికిన శాస్త్రీయ ఆధారాలు, టెక్నికల్‌ డేటా ఆధారంగా నిందితులు గుజరాత్‌లోని జేసవాడ థానా పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడే రెండు వారాల పాటు మకాం వేసిన బృందం అక్కడి పోలీసుల సహకారంతో ఈ నెల 18న ఐదుగురు ముఠా సభ్యుల్లో ఇద్దరు హసన్‌ నర్సింగ్, రాజు సవ్‌సింగ్‌ బర్లాను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను లునవాడలోని చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారంట్‌పై సోమవారం నగరానికి తీసుకొచ్చారు. వీరి అరెస్టుతో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎనిమిది కేసుల్లో మిస్టరీ వీడింది. పరారీలో ఉన్న వినోద్, పంకజ్, జేసమ్‌ కోసం గాలిస్తున్నామని సీపీ సజ్జనార్‌ తెలిపారు. చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్‌ఓటీ సీఐ కె.పురుషోత్తమ్, ఎస్‌ఐ ఎస్‌కే.లాల్‌ మదర్‌లతో పాటు గ్యాంగ్‌ సభ్యులను గుర్తించడంలో సహకరించిన బాలానగర్‌ ఎస్‌ఓటీ బృందాన్ని సీపీ ప్రశంసించారు.  

మరిన్ని వార్తలు