గుజరాత్‌ మహిళా ముఠా కలకలం 

30 Jun, 2019 12:48 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం(కృష్ణా) : గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన కొందరు యువతులు నియోజకవర్గంలో కలకలం సృష్టించారు. సుమారు 20 మంది యువతులు శనివారం పట్టణంలో ప్రత్యక్షమయ్యారు. చిన్నచిన్న పుస్తకాలు విక్రయించే ముసుగులో ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తుండటంతో మధ్యాహ్నం చిలకలపూడి పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారించగా బతుకుదెరువు కోసం వచ్చామంటూ తెలిపారు. చేతిలో డబ్బులు లేకపోవడం, తీసుకొచ్చిన పుస్తకాలు ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో అనాధ పిల్లలకు విరాళాలంటూ మరో విధంగా వసూళ్లు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

అనాధ పిల్లల సహాయార్ధం విరాళాలు ఇవ్వాలని ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు లాక్కొంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్ల డైంది. దీనిపై నిందితులను రాత్రి 7.30 గంటలకు తహసీల్దార్‌ డి.సునీల్‌బాబు ముందు హాజరుపర్చారు. సుదీర్ఘ విచారణ నిర్వహించిన అనంతరం రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తులపై నిందితులను విడుదల చేశారు. బలవంతంగా డబ్బు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలాఉండగా ఉదయం వీరందరూ పాఠశాలల వద్ద నిఘా వేసినట్లు పలువురు చెప్పుకుంటున్నారు. ఒకేసారి అందరూ సమూహంగా సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పిల్లలను ఎత్తుకుపోయేవారు సంచరిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ఇటీవల వైరల్‌ అవుతున్న వార్త ప్రజల్లో మరోమారు చర్చకు వచ్చింది. వీరంతా పిల్లలను ఎత్తుకుపోవడానికే వచ్చారనే వదంతులు షికారు చేశాయి. అయితే చిలకలపూడి పోలీసులు అప్రమత్తమై వీరిని అదుపులోకి తీసుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు