గల్ఫ్‌పేరుతో ఘరానా మోసం

9 Mar, 2019 10:33 IST|Sakshi
గల్ఫ్‌ ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులు(ఫైల్‌)

సాక్షి, జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలో గల్ఫ్‌ ఏజెంట్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. నిరుద్యోగ యువతను ఉపాధినిమిత్తం విదేశాలకు పంపిస్తామంటూ నమ్మించి అందినకాడికి దండుకుంటున్నారు. పొంతనలేని పనులు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. మరికొంతమంది గల్ఫ్‌పేరుతో ఉద్యోగమిప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. ఇటీవల గల్ఫ్‌ఏజెంట్‌ మోసం చేశాడని రాయికల్‌ మండలం కిష్టంపేట గ్రామంలో ఏజెంట్‌ ఇంటిముందే బాధితులు ధర్నా నిర్వహించారు.

కుమ్మరిపల్లిలో ఏజెంట్‌ మోసం చేశాడని ఓ బాధితుడు సెల్‌టవర్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఇలా చాలామంది బాధితులు ఏజెంట్ల చేతుల్లో మోసపోయి పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో సుమారు 320మంది ఎలాంటి అనుమతులు లేకుండా గల్ఫ్‌ ఏజెంట్లుగా నిర్వహిస్తున్నారు. ట్రావెల్స్‌ పెట్టుకుని గల్ఫ్‌దేశాలకు పంపిస్తామంటూ విస్తృత ప్రచారం చేయించుకుంటున్నారు. వీరిని నమ్మిన కొంతమంది ఇంటర్వ్యూలకు హాజరై పాస్‌పోర్టుతో పాటు కొంత మేరకు డబ్బు చేతుల్లో పెట్టి మోసాలకు గురవుతున్నారు. 

నిఘా పెట్టిన పోలీసులు 
జిల్లా వ్యాప్తంగా గల్ఫ్‌ మోసాలను అరికట్టేందుకు పోలీసులు ట్రావెల్స్‌లపై మూకుమ్మడి దాడులు చేసి పాస్‌పోర్టులు, విలువైన డాక్యుమెంట్లు సీజ్‌ చేసి కేసులు కూడా నమోదు చేశారు. పోలీసులు నిఘా పెట్టినా ఉపాధి కోసం వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో గల్ఫ్‌ ఏజెంట్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు స్పీడ్‌ పెంచారు. గ్రహించిన గల్ఫ్‌ ఏజెంట్లు గత నెల రోజులుగా రహస్య ప్రాంతాల్లో పోలీసుల కళ్లుగప్పి గల్ఫ్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. 

నిబంధనల సడలింపుతో 8 మందికే లైసెన్స్‌లు 
ట్రావెల్స్‌ల కోసం కేంద్ర విదేశీ వ్యవహారల శాఖ సడలింపు ఇవ్వడంతో జగిత్యాల జిల్లాలో గల్ఫ్‌ దేశాలకు పంపించేందుకు 8 ట్రావెల్స్‌లకు మాత్రమే అనుమతులు వచ్చాయి. రూ.50 లక్షలు డిపాజిట్‌ చేసిన ట్రావెల్స్‌ వారికి ఐదు సంవత్సరాలకోసారి రెన్యువల్‌ ఉండగా రూ.8 లక్షలు చెల్లించిన వారికి సంవత్సరానికోసారి రెన్యువల్‌ చేసుకునేలా అనుమతులు ఇచ్చారు. మిగతా వారికి ఎవరికీ అనుమతులు లేకుండా ముంబాయ్, చెన్నై, ఢిల్లీ ఇతర ప్రాంతాల నుంచి గల్ఫ్‌ ఏజెంట్లను తెప్పించి ఇక్కడ పనిచేస్తున్న ఏజెంట్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారి నుంచి ఒరిజినల్‌ పాస్‌పోర్టుతో పాటు కొంత మేరకు వీసా అడ్వాన్స్‌ తీసుకుంటున్నారు.  

పోలీసుల నజర్‌ 
జిల్లాలో గల్ఫ్‌ ఏజెంట్లపై నజర్‌ పెట్టారు. దాదాపు ఆరునెలల కాలంలో సుమారు 72కి పైగా గల్ఫ్‌ ఏజెంట్లపై కేసులు నమోదు చేశారు. అయినా ఏజెంట్లలో మాత్రం మార్పు రావడం లేదు. నిరుద్యోగుల నుంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్నారు. 

పాస్‌పోర్టులు స్వాధీనం.. 
వివిధ దేశాల్లో ఉద్యోగాలున్నాయని, సబ్‌ ఏజెంట్ల వాట్సప్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్న ట్రావెల్స్‌ ఏజెంట్లు ఇంటర్వ్యూలకు వచ్చిన నిరుద్యోగుల నుండి మీరు ఎంపికయ్యారని, పాస్‌పోర్టులు తీసుకుని నకిలీ వీసాలు అప్పగించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అనుకున్న సమయానికి వీసా రాకపోవడంతో తమకు పాస్‌పోర్టు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచితే వారి వద్ద నుండి సుమారు రూ.10వేల నుండి రూ.20వేలవరకు ట్రావెల్స్‌ యజమానులు వసూలు చేస్తున్నారు.  

మోసపోవద్దు  
జగిత్యాల ప్రాంతంలో చాలా మంది యువకులు గల్ఫ్‌కు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గల్ఫ్‌కు వెళ్లేవారు ప్రభుత్వం గుర్తించిన సంస్తల ద్వారానే విదేశాలకు వెళ్లాలి. ఇతర ప్రయివేటు వ్యక్తులను, గల్ఫ్‌ ఏజెంట్లను నమ్మి యువకులు మోసపోవద్దు. చాలా మంది గల్ఫ్‌ ఏజెంట్లు నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని మోసం చేస్తున్నారు. అనుమతి లేని గల్ఫ్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం

– ప్రకాశ్, జగిత్యాల పట్టణ సీఐ   

మరిన్ని వార్తలు