వెంకటాద్రి రైలులో తుపాకీ కలకలం!

26 Dec, 2018 11:47 IST|Sakshi

ఏఆర్‌ కానిస్టేబుల్‌ చక్రి ఆయుధంగా గుర్తింపు

ఎంపీ సీఎం రమేష్‌ రక్షణగా చక్రి నియామకం

హైదరాబాద్‌ నుంచి ఎర్రగుంట్లకు పయనం...

ఎంపీతో పాటు ఎర్రగుంట్లలో దిగిపోయిన కానిస్టేబుల్‌

రైలు చిత్తూరు చేరుకునే వరకు ఆయుధం లేనట్లు గుర్తించని గన్‌మెన్‌

రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకొని ఆపై విచారణ చేపట్టిన వైనం

సాక్షి ప్రతినిధి కడప: అక్కడ ప్రయాణికులెవ్వరూ లేరు.. తుపాకీ మాత్రమే ఉంది. ఎవరైనా వస్తారేమో, ఆయుధం గురించి వాకబు చేస్తారామోనని సిబ్బంది వేచి ఉన్నారు. ఎవ్వరూ రాలేదు. తుపాకీ రైళ్లోకి ఎలా వచ్చింది.. ప్రభుత్వ ఆయుధమా...అక్రమ ఆయుధమా అని సిబ్బంది మదనపడుతున్నారు. ఎంతకీ తెలియడం లేదు. ట్రైన్‌ ఆఖరు స్టేషన్‌ రానే వచ్చింది. వెంటనే సిబ్బంది రైల్వే పోలీసులకు తుపాకీ విషయం చేరవేశారు. తుపాకీ స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. తుదకు ఏఆర్‌ కానిస్టేబుల్‌ చక్రి ఆయుధంగా గుర్తించారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వెంకటాద్రి రైలులో కలకలం రేపింది.

ఏఆర్‌ కానిస్టేబుల్‌ చక్రి ఎంపీ రమేష్‌కు గన్‌మెన్‌గా విధుల్లో ఉన్నారు. సోమవారం రాత్రి ఎంపీతో పాటు గన్‌మెన్‌ హైదరాబాద్‌ నుంచి ఎర్రగుంట్లకు వెంకటాద్రి రైల్లో ప్రయాణించారు. రాత్రి 4.30గంటలకు ట్రైన్‌ ఎర్రగుంట్ల చేరుకుంది. ఎంపీ రమేష్‌తో పాటు గన్‌మెన్‌ చక్రి  ట్రైన్‌ దిగారు. ఎంపీ లగేజీ పట్ల జాగ్రత్త వహించి, చేతబట్టుకున్న గన్‌మెన్‌ తన ఆయుధం ట్రైన్‌లోనే మర్చిపోయారు. ఆయుధం మర్చిపోయిన విషయం అసలు గుర్తించలేదు. ట్రైన్‌ కడప, నందలూరు, రాజంపేట, రైల్వేకోడూరు, రేణిగుంట చేరుకుంది. ఆయుధం మాత్రమే ప్రయాణిస్తోంది.  ప్రయాణికులెవ్వరూ లేకపోగా, తుపాకీ మాత్రమే ఉన్న విషయాన్ని గుర్తించిన క్లినింగ్‌ సిబ్బంది రైల్వే పోలీసులకు తిరుపతిలో  సమాచారం ఇచ్చారు. తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి, ఎంపీ రమేష్‌ గన్‌మెన్‌ చక్రి ఆయుధంగా గుర్తించి సమాచారం చేరవేశారు. 8.30 గంటలకు వరకూ తన ఆయుధం మిస్‌ అయ్యిందన్న విషయాన్ని గన్‌మెన్‌ చక్రి గుర్తించలేదు. రైల్వే పోలీసుల నుంచి సమాచారం రాగానే హుటాహుటిన పయనమయ్యారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ చిట్టచివర స్టాపింగ్‌ చిత్తూరు కావడంతో అక్కడికి చేరుకొని రైల్వేపోలీసులకు ఏఆర్‌ కానిస్టేబుల్‌ చక్రి వివరాలు తెలియజేశారు.

అసలు కంటే కొసరుకే ప్రాధాన్యత....
ప్రజాప్రతినిధుల గన్‌మెన్లు నాయకుని వ్యక్తిగత భద్రత కంటే ఆ నాయకుని మెప్పు కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికారపార్టీ నేతల వద్ద విధులు నిర్వర్తించేవారు ఈ కోవలో మరింత దూకుడుగా వ్యవహారిస్తున్నారు. అందుకు అనేక ఘటనలు నిదర్శనంగా ఉన్నాయి. మంత్రి ఆదినారాయణరెడ్డి కనుసైగల మేరకు ఆయన గన్‌మెన్లు ఏకంగా ఓ వ్యాపారిని కిడ్నాప్‌కు పాల్పడిన ఉదదంతం జిల్లా పాఠకులకు విధితమే. వ్యాపారి ఫిర్యాదు మేరకు మంత్రి గన్‌మెన్‌పై కేసు నమోదు కాగా, ప్రస్తుతం వారిలో ఒకరు సస్పెన్షన్‌ ఎదుర్కొన్నారు. అలాగే ప్రభుత్వ హోదాలో ఉన్నా మరో నాయకుడి గన్‌మెన్‌ ఏకంగా రాజకీయప్రత్యర్థి పార్టీ గ్రామస్థాయి నాయకులను బెదిరింపులకు పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి గన్‌మెన్‌ చంద్రశేఖర్‌రెడ్డి తుపాకీ తన కుమారుని అప్పగించిన ఘటనలో ఏకంగా తన ప్రాణాలే పోగొట్టుకున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు గన్‌మెన్‌ చక్రికి ఎంపీ లగేజీ పట్ల ఉన్న శ్రద్ద తన ఆయుధంపై లేకపోయింది. ఈ ఘటనలన్నీ గన్‌మెన్లు విధులు, అంకితభావానికి ప్రశ్నార్థకంగా నిలుస్తోండడం విశేషం.

మరిన్ని వార్తలు