ధార్వాడ దడదడ

26 Sep, 2019 13:30 IST|Sakshi
హతుడు శ్యాంసుందర్‌ దేవరాజ్‌ (ఫైల్‌)

ప్రైవేటు కంపెనీ మేనేజర్‌ కాల్చివేత  

కారులో వెళ్తుండగా, బైక్‌పై వెంటాడిన దుండగులు  

కాల్పులు జరిపి పరారీ  

వాణిజ్యనగరిలో ఐదు రోజుల్లో రెండో హత్య  

కర్ణాటక, హుబ్లీ: వాణిజ్య నగరం ధార్వాడ తుపాకీ చప్పుళ్లలో దద్దరిల్లుతోంది. బుధవారం ఉదయం ఓ ప్రైవేటు కంపెనీ మేనేజర్‌ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఉత్తర కన్నడ జిల్లా దాండేలికి చెంది న శ్యాంసుందర్‌ దేవరాజ్‌ (42) హత్యకు గురైన వ్యక్తి. ఉదయం 8 గంటల ప్రాంతంలో ధార్వాడ–హళియాళ రోడ్డులో నిగది సమీపంలో ఘటన జరిగింది. శ్యాం సుందర్‌ హుబ్లీ విమానాశ్రయం ద్వారా ఢిల్లీకి వెళ్లడానికి కారులో వస్తుండగా దాండేలి నుంచే వెంటాడిన ఈ ముగ్గురు దుండగులు హళియాళ రోడ్డులో నిగది గ్రామం వద్ద వెళ్తున్న కారును ఓవర్‌టేక్‌ చేసి కారు కిటికి నుంచే తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు. తుపాకీ గుళ్లు శ్యామ్‌ సుందర్‌ ఎడమ భుజంలోకి దూసుకెళ్లగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిచిపోయింది. కొందరు స్థానికులు గమనించి తక్షణమే అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలను వదిలారు. శ్యామ్‌ సుందర్‌ ప్యానాసోనిక్‌ కంపెనీలో మేనేజర్‌గా పని చేసేవారు. 

రాజకీయ కక్షలే కారణమా?
రాజకీయ విబేధాల వల్ల హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. కొంతకాలం కిందట మున్సిపల్‌ ఎన్నికల్లో దాండేలి నగరసభకు శ్యామ్‌సుందర్‌ భార్య కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కొందరితో ఆయనకు విబేధాలు నెలకొన్నాయి. ఎన్నికల తరువాత ఆయన ఢిల్లీలోను, బెంగళూరులోనూ మకాం మార్చారు. గత జనవరి నుంచి ఢిల్లీలోనే నివసిస్తున్నారు. కుటుంబాన్ని కలవడానికి శనివారం దాండేలికి వచ్చారని శ్యాం సుందర్‌ సోదరుడు జాన్సన్‌ తెలిపారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ వర్థిక కటియార, డీఎస్పీ రామనగౌడ హట్టి, సీఐ శివానంద కమతగి, ఎస్‌ఐ ఆనంద టక్కనవర తదితరులు పరిశీలించారు. ఈఘటనపై ధార్వాడ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

ఐదురోజుల్లోనే రెండోసారి కాల్పులు   
కాగా ఐదు రోజుల క్రితం హుబ్లీ మంజునాథ నగర క్రాస్‌ వద్ద బీహార్‌కు చెందిన సర్వేష్‌ యోగేంద్రసింగ్‌ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చి హత్య చేశారు. రెండు నెలల క్రితమే హుబ్లీకి వచ్చారు. భార్యతో కలిసి నివసించేవారు. ఆమె 8 నెలల గర్భిణి. బైక్‌మీద వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనను హత్యచేసి పరారయ్యారు. వరుస హత్యలతో జంటనగరాల వాసుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు