మంగళగిరిలో తుపాకి కలకలం

25 Aug, 2019 08:41 IST|Sakshi
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ డి.నరేష్‌కుమార్‌ తదితరులు 

సాక్షి, మంగళగిరి: రాజధాని ప్రాంతంలో కీలక పట్టణమైన మంగళగిరిలో తుపాకి కలకలం సృష్టించింది. తుపాకితో సంచరిస్తున్న వ్యక్తితో పాటు మారణాయుధాలు కలిగి ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను మంగళగిరి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం పట్టణ సీఐ డి.నరేష్‌కుమార్‌ నిందితుల వివరాలను వెల్లడించారు.

ఆయన కథనం ప్రకారం... మంగళగిరి పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, పట్టణ పరిధిలోని బాప్టిస్టుపేట ప్రాంత సమీపంలో గలాటా చేస్తున్నట్లు పోలీసులకు శుక్రవారం సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వారు భయపడుతుండటంతో వారిని తనిఖీ చేశారు. వారి వద్ద మారణాయుధాలు ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురిలో ఇద్దరు యువకులైన ఆకురాతి వెంకట శివ రాఘవ అలియాస్‌ ఏవీఎస్, బండారు రవి రౌడీషీటర్లు. వీరిద్దరితో పాటు ఉన్న మరో యువకుడు ఇళ్లా రవి వద్ద మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లా రవి వద్ద ఒక తుపాకి, ఏవీఎస్, బండారు రవి వద్ద రెండు కత్తులు ఉన్నాయి.

నిందితులను వెంటనే పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ముగ్గురు నిందితుల్లో ఇళ్లా రవిపై కూడా రౌడీషీటు తెరవనున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన వారిలో ఎస్సై నారాయణ, క్రైమ్‌ సిబ్బంది నాగాంజనేయులు, శివప్రసాద్, శాంతకుమార్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు