గుంత రేణుక అరెస్ట్‌

19 Dec, 2019 02:28 IST|Sakshi

ఆత్మకూర్‌ కోర్టుకు తరలింపు 

గద్వాల క్రైం/ఆత్మకూర్‌: నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారనే నెపంతో గుంత రేణుక (ఏ6)ను బుధవారం గద్వాలలోని రామిరెడ్డి స్మారక గ్రంథాలయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆత్మకూర్‌ కోర్టుకు తరలించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం ఎల్కూర్‌కు చెందిన టీవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగన్న (నాగరాజు) నిషేధిత మావోయిస్టు పార్టీలోకి యువతను నియమిస్తున్నారన్న సమాచారం అందడంతో గత అక్టోబర్‌ 5న అతడిని అరెస్టు చేశారు. అదే నెల 7, 11న టీవీవీ బలరాం, ఓయూ ప్రొఫెసర్‌ జగన్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.  

యువతను చేర్చుకుంటున్నారు..  
నిషేధిత మావోయిస్టు పార్టీలోకి యువతను చేర్చుకుంటున్నారన్న సమాచారంతో ఈ కేసులోని ఆరుగురు సానుభూతిపరులను అరెస్టు చేశామని జిల్లా ఇన్‌చార్జ్‌ ఎస్పీ అపూర్వరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు, విధ్వంసకర కార్యకలాపాలను నిర్వహించడానికి, మావోయిస్టు పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రమంతా వారు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.  

శిల్ప, రమేశ్‌లకు 14 రోజులు రిమాండ్‌.. 
హైదరాబాద్‌లో ఈ నెల 17న అరెస్టయిన చైతన్య మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుక్కల శిల్ప, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచు రమేశ్‌లను కోర్టు 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆత్మకూర్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో గద్వాల పోలీసులు వారిని హాజరుపర్చా రు. న్యాయమూర్తి జీవన్‌ సూరజ్‌సింగ్‌ 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా జైలుకు తరలించినట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు