గుప్తనిధి తవ్వకాల గ్యాంగ్‌ అరెస్ట్‌

20 May, 2018 07:24 IST|Sakshi

చెన్నూర్‌ : గుప్త నిధుల తవ్వకాల కోసం వచ్చిన గ్యాంగ్‌లో నుంచి ఆరుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. వీరిని శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ కిశోర్‌కుమార్‌ విలేకరల ఎదుట ప్రవేశపెట్టారు. అరెస్ట్‌ చేసిన సభ్యుల వివరాలు వెల్లడించారు. చెన్నూర్‌ మండలం రాయిపేట గ్రామ సమీపంలో గల చెరువుకట్ట ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయని భీమారం గ్రామానికి చెందిన సమ్మయ్య అనే వ్యక్తి గోదావరిఖని, మెదక్, జమ్మికుంట, చెన్నూర్‌ పట్టణాల్లో ఉన్న తన పరిచయస్తులతో చెప్పారు. వీరంత ఒక గ్యాంగ్‌గా ఏర్పడి గుప్త నిధులు తవ్వకానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గురువారం రాత్రి రాయిపేట గ్రామంలో గుప్త నిధులు తవ్వకానికి వచ్చారు.

గ్రామ పొలిమేరల్లో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో గ్రామస్తులు వారిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు రాయిపేటకు వెళ్లి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. తమనమ్మపూడి నాగ జ్ఞానేశ్వర్‌రెడ్డి (రామచంద్రాపురం, మెదక్‌ జిల్లా), చిందం రాజన్న (గోదావరిఖని), దాముక రాజం (గోదావరిఖని), కొడిపె బక్కయ్య (చెన్నూర్‌), జన్నాల వేణుగోపాల్‌ (జమ్మికుంట), లాడి బెంజిమన్‌ (కొత్తగూడెం, భద్రాది జిల్లా)ను విచారించారు. వారి వద్ద పూజకు సంబంధించిన సామగ్రితోపాటు టార్చిలైట్, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గుప్త నిధుల కోసం వచ్చినట్లు వారు అంగీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కిశోర్‌కుమార్‌ తెలిపారు. పరారీలో ఉన్న మరోవ్యక్తి సమ్మయ్య కోసం గాలింపు నిర్వహిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్‌ చేస్తామన్నారు.  

మరిన్ని వార్తలు