‘సామూహిక ఆత్మహత్యలే శరణ్యం’

2 Apr, 2019 09:17 IST|Sakshi
బాధితుడి ఇంటిపై అల్లరి మూకల దాడి

సాక్షి, న్యూఢిల్లీ : హోలీ వేడుక జరిగిన రోజు గురుగ్రాంలో దాడికి గురైన ముస్లిం కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడతామని జిల్లా యం‍త్రాంగాన్ని హెచ్చరించింది. తమ కుటుంబంపై దాడి చేసిన అల్లరి మూక ఇంట్లోని మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేసిందని ఆ కుటుంబం పేర్కొంది. స్ధానిక రాజకీయ నేతల సిఫార్సుతో పోలీసులు, అధికారులు దాడికి తెగబడిన గూండాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది.

తమపై అల్లరిమూకలు పధకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడిన తీరు బహిర్గతమైందని, ఇప్పటికీ పోలీసులు తమకు సాయపడకుండా, ఫిర్యాదును వెనక్కితీసుకోవాలని తమను బెదిరిస్తున్న నిందితులకు, వారి కుటుంబ సభ్యులకు సహకరిస్తున్నారని బాధితుల్లో ఒకరైన మహ్మద్‌ అక్తర్‌ పేర్కొన్నారు. అల్లరి మూకలు తమ ఇంటికి వచ్చి తమ​మహిళలు, బాలికలను వేధిస్తే పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని, తమకు సామూహిక ఆత్మహత్యలే శరణ్యమని స్పష్టం చేశారు.

ఈ కేసులో త్వరితగతిన విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులకు బాధిత కుటుంబం మెమొరాండం సమర్పించింది. నిందితులపై చర్యలు చేపట్టకపోగా తమ కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులపై స్ధానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని అక్తర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా తాము గురుగ్రాంలో నివసిస్తున్నామని, హోలీ రోజున 30 నుంచి 40 మందితో కూడిన అల్లరి మూక తమ ఇంటిపై కర్రలతో దాడి చేసి తమను పాకిస్తాన్‌ వెళ్లాల్సిందిగా తీవ్ర వేధింపులకు గురిచేసిందని చెప్పుకొచ్చారు. బాధితులు అల్లరిమూక దాడి దృశ్యాలను వీడియోలో రికార్డు చేశారు. కాగా ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణతోనే ఈ దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు