ప్రిన్సిపల్‌ సంతకం ఫోర్జరీ

25 Feb, 2020 13:12 IST|Sakshi

రూ.7.40లక్షలు స్వాహా   

గురుకుల పాఠశాల సీనియర్‌ అసిస్టెంట్, రికార్డ్‌ అసిస్టెంట్‌పై ఫిర్యాదు  

పశ్చిమగోదావరి,చింతలపూడి: గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ సంతకాన్ని  ఫోర్జరీ  చేసి పాఠశాల నిధుల నుంచి రూ. 7.40 లక్షల నగదును కాజేసిన ఘటన చింతలపూడి మండలం, నాగిరెడ్డిగూడెం బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ ఎస్‌.దుర్గాభవాని సోమవారం స్థానిక  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. నాగిరెడ్డిగూడెం  గురుకుల పాఠశాలలో దినసరి భత్యంపై పని చేస్తున్న  కె.హరీష్‌బాబు, రిటైర్డ్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ జీవీఆర్‌ మోహన్‌రావు  కలిసి ఈ సొమ్మును కాజేశారని, వారిపై చర్యలు తీసుకుని  గురుకుల పాఠశాల  సొమ్మును రికవరీ చేయాలని ప్రిన్సిపల్‌ ఫిర్యాదులో కోరారు.

గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో స్కూల్‌ ఖాతా నుంచి సొమ్మును డ్రా చేశారని తెలిపారు. బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లో వివిధ దఫాలుగా సొమ్ములు డ్రా చేసినట్లు ఉందని, డ్రా అయిన సొమ్ముల వివరాలు తమ క్యాష్‌ బుక్‌లో లేక పోవడంతో బ్యాంకుకు వెళ్లి విచారించగా గత ఏడాది జూలై 6వ తేదీన రూ.1.40 లక్షలు, అదే నెల 15వ తేదీన రూ.2.50 లక్షలు, ఆగస్టు 9న రూ.3.50 లక్షలు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి డ్రా చేసినట్లు ఉందని వెల్లడించారు. గురుకుల  పాఠశాల నిధులను ఫోర్జరీ  చేసి స్వాహా చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ దుర్గా భవాని కోరారు. 

మరిన్ని వార్తలు