వేధింపులకే వెళ్లిపోయాడా?

16 Dec, 2019 11:01 IST|Sakshi
రోదిస్తున్న మృతుడి కుటుంబసభ్యులు

రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న గురుకుల  విద్యార్థి

తీవ్ర శోకంలో కుటుంబసభ్యులు

సాక్షి, సిర్పూర్‌(టి)(కాగజ్‌నగర్‌): సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్న పిట్టల నవీన్‌ (16) అనే విద్యార్థి శనివారం పాఠశాల వెనుకాల ఉన్న రైల్వేలైను పక్కన శవమై కనిపించాడు. పాఠశాల నుంచి ఈనెల 11న మధ్యాహ్నం బయటికి వెళ్లిన పిట్టల నవీన్‌ తిరిగిరాకపోవడంతో పాఠశాల ప్రిన్సిపాల్‌ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత గురువారం సిర్పూర్‌(టి) పోలీసుస్టేషన్‌లో విద్యార్థి అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు.

సిర్పూర్‌(టి) ఎస్సై వెంకటేష్‌ దర్యాప్తు చేస్తుండగా శనివారం సాయంత్రం సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల వెనుకాల ఉన్న రైల్వేలైను పక్కన చెట్ల పొదల్లో ఓ మృతదేహాన్ని చూసిన పశువుల కాపరి పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు నవీన్‌ తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో విద్యార్థి తల్లితండ్రులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి మృతదేహం తమ కుమారునిదే అని గుర్తించారు. 

తల్లితండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చిన విద్యార్థి ఆత్మహత్య
తన కొడుకు ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించి కుటుంబానికి చేదేడు వాదోడుగా నిలుస్తాడని కోటి ఆశలతో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో తల్లితండ్రులు చేర్పించగా తన కొడుకు అర్ధాంతరంగా పాఠశాల నుంచి వెళ్లిపోయి ఆత్మహత్యకు పాల్పడటంతో విద్యార్థి తల్లితండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

బందువులు, ఎమ్మార్పీఎస్‌ నాయకుల ధర్నా
బాలుర గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్, పీడీ, ఆర్మీ ఇన్స్‌స్ట్రక్టర్‌ల వేధింపులకు పాఠశాల నుంచి పారిపోయి  రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న నవిన్‌ కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మార్పీఎస్‌ నాయకులు ధర్నా చేశారు. బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, 20లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వం నుంచి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయాలని, మూడు ఎకరాల భూమి ఇప్పించాలని వారు డిమాండ్‌ చేశారు.

పీడీ సుమిత్, ఆర్మీ ఇన్స్‌స్ట్రక్టర్‌ శ్రీనివాస్‌లను సస్పెండ్‌ చేస్తున్నామని, ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌కుమార్‌పై విచారణ చేపడుతున్నామని సాంఘిక సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లా ఆర్‌సీవో గంగాధర్‌ తెలిపారు. అంత్యక్రియల కొరకు తక్షణ ఆర్థిక సహాయంగా 30వేల రూపాయల నగదును అందజేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

శోకసంద్రం నడుమ విద్యార్థి అంత్యక్రియలు
కౌటాల(ఆసిఫాబాద్‌): నవీన్‌ అంత్యక్రియలు ఆదివారం కౌటాలలో శోకసంద్రంనడుమ ముగిశాయి. మృతుడి తండ్రి శ్రీనివాస్‌ కౌటాల గ్రామ పంచాయతీలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడికి తమ్ముడు ప్రవీణ్, చెల్లి నవ్య ఉన్నారు. 

వేధింపులతోనే మృతి
తమ కుమారుడు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, పీడీ, ఆర్మీ టీచర్, తెలుగు టీచర్‌ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు, బందువులు ఆరోపించారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా