పాన్‌షాప్‌తో జీవితం ప్రారంభించి.. గుట్కా డాన్‌గా..!

28 Aug, 2019 07:02 IST|Sakshi
అల్లీపురంలో గుర్తించిన పాన్‌మసాలా తయారీ పరికరం, పాన్‌మసాలా ప్యాకెట్లు  

నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గుట్కా తయారీ కేంద్రాల ఏర్పాటు

పలుమార్లు పోలీసుల దాడులు

తాజాగా ప్రకాశం జిల్లాలో దాడితో పరార్‌

గాలింపు ముమ్మరం చేసిన రెండు జిల్లాల పోలీసులు  

సాక్షి, నెల్లూరు : అతని జీవితం పాన్‌షాప్‌తో ప్రారంభమైంది. క్రమంగా గుట్కా డాన్‌గా ఎదిగాడు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గుట్కా తయారీ కేంద్రాలను ఏర్పాటుచేసి రూ.కోట్లు సంపాదించాడు.  ప్రకాశం జిల్లా మేదరమిట్లలో నిషేధిత ఖైనీ, గుట్కా తయారీ కేంద్రం నిర్వహిస్తుండగా అక్కడి పోలీసులు ఇటీవల దాడి చేశారు. రూ.3 కోట్లు విలువచేసే తయారీ మెషిన్లు, ఖైనీ, గుట్కాలు, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న గుట్కా డాన్‌ కోసం రెండు జిల్లా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు బాలాజీనగర్‌ మసీద్‌ సెంటర్‌ ప్రాంతానికి చెందిన బి.ప్రసాద్‌ కొన్నేళ్ల క్రితం ట్రంకురోడ్డులోని ఓ కేఫ్‌ వద్ద పాన్‌షాప్‌ నిర్వహించేవాడు. గుట్కాలు, ఖైనీలు విక్రయించేవాడు. అనంతరం స్నేహితుల సహకారంతో జనార్దన్‌రెడ్డికాలనీలో, వెంకటాచలంలో గుట్కా తయారీ కేంద్రాలను ఏర్పాటుచేసి వివిధ కంపెనీలకు చెందిన గుట్కా, ఖైనీలు పెద్దఎత్తున తయారుచేసి విక్రయించాడు.

2015లో వెంకటాచలం పోలీసులు బ్రిక్స్‌ మాటున గుట్కాతయారీ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో గుట్కా తయారీ కేంద్రంపై దాడిచేశారు. పరికరాలు, ముడిపదార్థాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పోలీసుల దాడులు అధికమైన నేపథ్యంలో ప్రసాద్‌ కొంతకాలం వ్యాపారానికి దూరంగా ఉన్నాడు. అనంతరం తన మకాంను ప్రకాశం జిల్లాకు మార్చాడు. మేదరమిట్లలో తెలుగుదేశం పార్టీ నేతకు చెందిన పొగాకు గోదామును అద్దెకు తీసుకుని అందులో గుట్కా, ఖైనీ తయారీ పరికరాలను ఏర్పాటు చేశాడు. పెద్దఎత్తున గుట్కా, ఖైనీలను తయారుచేసి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విక్రయించి సొమ్ము చేసుకోసాగాడు.

పక్కా సమాచారంతో..
గతేడాది జనవరిలో ప్రసాద్‌ అతని స్నేహితులు నెల్లూరు బారాషహీద్‌ దర్గా సమీపంలో నిషేధిత గుట్కా, ఖైనీలు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో చిన్నబజారు పోలీసుస్టేషన్‌ ఎస్సై కరిముల్లా నిందితులపై దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన ప్రసాద్, మరో ఇద్దరు పరారీ కాగా శివ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అతని నుంచి రూ.4 లక్షలు విలువచేసే గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి నిందితులు పరారీలో ఉన్నారు. ప్రకాశం జిల్లా కేంద్రంగా చక్రం తిప్పసాగారు. ఇటీవల ఆ జిల్లాలో పోలీసుల నిఘా పెరగడంతో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈక్రమంలో ఈనెల 24వ తేదీన ప్రకాశం జిల్లా అద్దంకి సీఐ అశోక్‌వర్ధన్, మేదరమిట్ల ఎస్సై బాలకృష్ణలు తమ సిబ్బందితో కలిసి తయారీ కేంద్రంపై దాడులు చేసేందుకు వెళ్లారు. అప్పటికే నిర్వాహకుడు కేంద్రాలకు తాళం వేసి పరారవడంతో పోలీసులు గోదాము షట్టర్‌ తాళాలను పగులగొట్టారు. రూ.3 కోట్ల విలువచేసే తయారీ పరికరాలు, ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. గోదాము యజమాని హనుమంతరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  

అల్లీపురంలోనూ..
నిందితుడు ప్రసాద్‌ నెల్లూరు రూరల్‌ మండల పరిధిలోని అల్లీపురంలో ఓ గదిని అద్దెకు తీసుకుని తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడని పోలీసుల విచారణలో హనుమంతరావు వెల్లడించాడు. దీంతో అద్దంకి సీఐ అశోక్‌వర్ధన్‌ తన సిబ్బందితో కలిసి రెండురోజుల క్రితం నెల్లూరుకు చేరుకున్నారు. రూరల్‌ పోలీసుల సహకారంతో అల్లీపురంలోని తయారీ కేంద్రాన్ని çతనిఖీ చేశారు. అక్కడ గుట్కా, ఖైనీలకు సంబంధించిన ఎలాంటి పదార్థాలు లభ్యం కాలేదని తెలిసింది. స్వాస్‌ పేరిట పాన్‌మసాలా (మౌత్‌ రీఫ్రెషనర్‌) ప్యాకెట్లు, అందులో వినియోగించి కిస్మిస్, జీడిపప్పు, సోంప్‌ పదార్థాలు, తయారీ పరికరాన్ని గుర్తించారు. దీంతో çపోలీసులు వాటి శాంపిల్స్‌ను తీసుకున్నారు. సదరు గోదాముకు రూరల్‌ పోలీసులు తాళాలు వేశారు. గోదాము యజమాని నుంచి ప్రసాద్‌ వివరాలు సేకరించారు. పాన్‌షాపు నుంచి గుట్కాడాన్‌గా ఎదిగిన  ప్రసాద్‌ కోసం ప్రకాశం జిల్లా పోలీసులుతోపాటు నెల్లూరు పోలీసులు గాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు