రెచ్చిపోతున్న గుట్కా మాఫియా

26 May, 2018 13:20 IST|Sakshi
వివిధ రకాల గుట్కా ప్యాకెట్లు

జిల్లా వ్యాప్తంగా రోజుకు అర కోటికిపైగా వ్యాపారం

పోలీస్‌స్టేషన్‌ పక్కనే గోడౌన్‌ ఏర్పాటు

మంత్రి అనుచరుడని చెప్పుకుంటూ దందా

సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో గుట్కా మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. ఓ ముఠాగా ఏర్పడి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎక్కువ ధరకు విక్రయించి రూ.లక్షలు సంపాదిస్తోంది. పోలీసులు, సంబంధిత అధికారులకు రోజు వారి మామూళ్లతో మేనేజ్‌ చేస్తోంది. రోజుకు జిల్లా వ్యాప్తంగా రూ.అరకోటికిపైగా వ్యాపారం జరుగుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం ప్రజలకు హాని కలిగించే పొగాకు ఉత్పత్తులను (పాన్‌పరాగ్, హీరా, స్టార్, చైనీ ఖైనీ, రాజా, గోవాతోపాటు పలు రకాల గుట్కా బ్రాండ్లపై) ప్రభుత్వం నిషేధం విధించింది. అవి విక్రయించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు రంగంలోకి దిగారు.

గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సరుకు తెప్పిస్తున్నారు. చిల్లర దుకాణం, ఇతర వ్యాపారాల ముసుగులో అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తమ ఏజెంట్లను నియమించుకుని మరీ సరఫరా చేస్తున్నారు. కొంతమంది గుట్కాకు బానిక కావడం, అవి మార్కెట్లో లభించకపోవడంతో ఎంత ధరైనా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. దీన్ని అక్రమార్కులు ఆసరాగా చేసుకుంటున్నారు. కొన్న ధర కంటే అధికంగా విక్రయించి రూ.లక్షలు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. పోలీసులు, విజిలెన్స్‌ అధికారులు దాడులు చేస్తే ఏదో ఒక రాజకీయ నాయకుడితో సిఫార్సు చేయించుకుని రెండు రోజులకే తిరిగి వ్యాపారం మొదలు పెడుతున్నారు. హానికర పొగాకు ఉత్పత్తులు తిన్న  ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

బందరులో ఆర్పేట కేంద్రంగాఅక్రమ దందా
ఆర్పేట కేంద్రంగా గుట్కా దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఏలూరు నుంచి గుట్ట చప్పుడు కాకుండా ఆర్పేటకు తరలిస్తున్నారు. మంత్రి అనుచరుడని చెప్పుకుంటూ రూ.లక్షల్లో అక్రమ వ్యాపారం సాగిస్తున్నాడు. పోలీసులు అమ్యామ్యాలు తీసుకుని ఈ విషయం తెలిసినా మిన్నకుండి పోతున్నారు. ఎంత దారుణమంటే ఆర్పేట పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే గోడౌన్‌ ఏర్పాటు చేసుకుని పట్టణంలో పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నా అరికట్టే నాథుడే కరువయ్యాడు. ఇటీవల ఓ ప్రాంతంలో సరుకు పట్టుబడితే మంత్రి విడిపించారే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. తనకు ఓ మంత్రి అండ ఉందని చెప్పుకుంటూ దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. పోలీసులు సైతం ఎందుకొచ్చిన తంటాల్లే అని మామూళ్లు పుచ్చుకుని మిన్నకుండిపోతున్నట్లు సమాచారం. ఇతను బందరుతో చుట్టపక్కల ప్రాంతాలకు సరఫరా చేస్తూ రూ.లక్షల్లో అక్రమార్కన గడిస్తున్నాడు. గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరుగా నడుస్తోంది.

మరిన్ని వార్తలు