'చిరుద్యోగి నుంచి ఏడాదికి రూ.20కోట్ల టర్నోవర్‌కు'

6 Jan, 2020 07:29 IST|Sakshi
స్వాదీనం చేసుకున్న గుట్కాలు, ఖైనీలు

వ్యాపారులతో గ్యాంగ్‌ ఏర్పాటు 

ఏడాదికి రూ.20కోట్లకుపైగా వ్యాపారం 

అక్రమాలకు పలువురు ఖాకీల అండదండలు? 

ఎట్టకేలకు డాన్ సహా మరో ఐదుగురి అరెస్ట్‌ 

పరారీలో 18మంది, కొనసాగుతున్న దర్యాప్తు 

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): గుట్కా తయారీదారుని వద్ద చిరుద్యోగిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. వ్యాపారంలోని మెళకువలు నేర్చుకున్నాడు. ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. అనేక సందర్భాల్లో పోలీసులు గ్యాంగ్‌సభ్యులను అరెస్ట్‌ చేసినా మూలాల్లోకి వెళ్లకపోవడంతో అతని వ్యవహారం బయటకు పొక్కలేదు. అదేక్రమంలో కొందరు పోలీసుల అండదండలు సైతం పుష్కలంగా ఉండటంతో మూడు గుట్కాలు, ఆరు ఖైనీలు అన్నచందాన వ్యాపారం సాగింది. అంతర్రాష్ట్ర గుట్కా డాన్‌గా ఎదిగి చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పోలీసుల కథనమ మేరకు బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళేనికి చెందిన అంజిబాబు ఉపాధి నిమిత్తం కొన్నేళ్లకిందట కటుంబంతో కలిసి చెన్నైకి వెళ్లాడు. అక్కడ ఉంటూనే  ఓ గుట్కా తయారీదారుని వద్ద చిరుద్యోగిగా చేరారు.

తనకున్న తెలివితేటలతో వ్యాపారాన్ని ఏపీలోని పలు జిల్లాలకు విస్తరింపజేశాడు. వ్యాపారంలో చురుకుగా ఉన్న వారితో గ్యాంగ్‌ను ఏర్పాటు చేశారు. చెన్నైతో పాటు ఢిల్లీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గుట్కా, ఖైనీలను వారికి  సరఫరా చేసేవాడు. వారు వాటిని రిటైల్‌ వ్యాపారులకు విక్రయించేవారు. చెన్నైలో పోలీసుల దాడులు అధికమవడంతో పాటు వివిధ కారణాతో ఆయన తన మకాంను బెంగళూరు ఇండస్ట్రియల్‌ ఏరియాకు మార్చాడు. అక్కడ ఉంటూ ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఏడాదికి రూ.20కోట్ల మేర గుట్కాలను గ్యాంగ్‌కు సరఫరాచేసి వారి ద్వారా రిటైల్‌ వ్యాపారులకు విక్రయిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తూ అంతర్రాష్ట్ర గుట్కా డాన్‌గా ఎదిగారు. కొంతకాలంగా గంజాయిని సైతం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ గుట్కా విక్రయాలను, అక్రమరవాణాను పూర్తిస్థాయిలో కట్టడిచేయాలని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను ఆదేశించారు.

టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఐ. శ్రీనివాసన్‌ నేతృత్వంలోని సిబ్బంది డాన్‌తో పాటు అతని గ్యాంగ్‌ కదలికలపై దృష్టిసారించారు. శనివారం నేలటూరులో అంజిబాబుతో పాటు, గ్యాంగ్‌లోని ఐదుగురు సభ్యులను అరెస్ట్‌చేశారు. వారి వద్ద నుంచి రూ.1.32కోట్లు విలువచేసే గుట్కాలు, వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం వారిని రహస్యప్రాంతానికి తరలించి తమదైన శైలిలో విచారించగా విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అక్రమ వ్యాపారానికి కొందరు పోలీసులు సహకరిస్తున్నారని నిందితులు ఆరోపించినట్లు తెలిసింది. అందుకు గాను సదరు పోలీసులకు నెలవారీ నజరానాలు ముట్టచెబుతున్నామని పేర్కొనట్లు తెలిసింది. ఈ విషయం ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ దృష్టికి వెళ్లడంతో లోతైన దర్యాప్తు చేయాలని, అక్రమాలకు సహకరిస్తున్న వారిని ఎట్టిపరిస్థితుల్లో  ఉపేక్షించవద్దని కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆదిశగా టాస్క్‌ఫోర్సు పోలీసులు విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు పేర్లను సైతం ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు తెలిసింది.  

పరారీలో మరికొందరు 
గ్యాంగ్‌లో మరో 18మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం. డాన్‌ను టాస్‌్కఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం తెలుసుకున్న గ్యాంగ్‌లోని సభ్యులు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం. పరారీలో ఉన్న వ్యక్తుల్లో కొందరు గతంలో పోలీసులకు చిక్కిజైలుపాలై ఉన్నారు.
  
వ్యాపారుల్లో వణుకు... 
పోలీసుల  దాడుల నేపథ్యంలో జిల్లాలో గుట్కా, ఖైనీ విక్రయ వ్యాపారుల వెన్నులో వణుకు మొదలైంది. మొత్తంమీద ఆరేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర గుట్కాడాన్, అతని గ్యాంగ్‌లోని సభ్యులను అరెస్ట్‌ చేయడంతో కొంతకాలం ఈ అక్రమవిక్రయాలు, రవాణాకు అడ్డుకట్టపడనుంది. గ్యాంగ్‌లోని మిగిలిన సభ్యులను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు