‘ఆ కేసులతో సంబంధం లేదు’

9 Jan, 2020 02:14 IST|Sakshi

హాజీపూర్‌ నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది

నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో జరిగిన బాలికల హత్యలకు సంబంధించిన కేసులో నింది తుడు శ్రీనివాస్‌రెడ్డి తరఫున వాదనలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ ఫస్ట్‌ అడిషనల్‌ సెషన్స్‌ కోర్టులో మూడు హత్యల్లో బుధవారం నిందితుడి తరఫున ఒక హత్యకు సంబంధించి వాదన పూర్తయింది. న్యాయమూర్తి ఎదుట నిందితుడి తరఫు న్యాయవాది ఠాగూర్‌ వాదనలు వినిపిస్తూ... శ్రీనివాస్‌రెడ్డికి, ఈ కేసులకు ఎలాంటి సంబంధం లేదని  కోర్టుకు తెలిపారు. ఫోన్‌నంబర్లు నిందితుడివే అయినా వాటిని ఉపయోగించింది శ్రీనివాస్‌రెడ్డే అని అనడానికి సరైన ఆధారాలు లేవని వెల్లడించారు.

కేవలం హాజీపూర్‌ గ్రామానికి చెందిన కొంతమంది అనుమానం వ్యక్తం చేయడంతో శ్రీనివాస్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారంటూ పేర్కొన్నారు. అనుమానం వ్యక్తం చేసిన వారికి, శ్రీనివాస్‌రెడ్డికి మధ్య భూ తగాదాలు ఉన్నాయని తెలిపారు. ఇది కావాలనే పెట్టిన కేసు తప్ప సరైన ఆధారాలు లేవంటూ కోర్టుకు నివేదించారు. మిగిలిన రెండు కేసులకు సంబంధించి వాదనను ఈనెల 17వ తేదీకి వాయిదా వేశారు. కాగా, పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చంద్రశేఖర్‌ రిటర్న్‌ ఆర్గ్యుమెంట్స్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు