‘దిశ’ ఘటన నేపథ్యంలో మళ్లీ తెరపైకి ‘హాజీపూర్‌’

6 Dec, 2019 08:54 IST|Sakshi
సైకో శ్రీనివాస్‌ రెడ్డి; హాజీపూర్‌ గ్రామం వ్యూ

నిందితుడు సైకో శ్రీనివాస్‌రెడ్డి శిక్షలో జాప్యం

ఉరిశిక్ష పడితే దారుణాలు జరుగవంటున్న హాజీపూర్‌ గ్రామస్తులు

సాక్షి, బొమ్మలరామారం: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన హాజీపూర్‌ బాలికల వరుస హత్యల కేసు మరోమారు తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో యువతులు, మహిళలు, బాలికలపై దారుణాలు నానాటికి పెరిగిపోతుండడంతో ప్రజల్లో ఆగ్రహం తారస్థాయికి చేరింది. రంగారెడ్డి జిల్లాలో దిశపై సామూహిక అత్యాచారం, హత్య, వరంగల్‌లో గాదం మానస అత్యాచారం, హత్యల నేపథ్యం, ముగ్గురు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడి అతి దారుణంగా హత్యలు చేసిన నిందితుడు సైకో మర్రి శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష పడడంలో జరుగుతున్న జాప్యంపై మండల ప్రజలు గుర్రుగా ఉన్నారు. మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఇప్పటికే కఠిన శిక్షలు ఖారారు అయితేనైనా నేరం చేసే వారికి వెన్నులో వణుకు పుట్టేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామంలో ఎవ్వరిని కదిలించినా సైకో శ్రీనివాస్‌ రెడ్డి దారుణాలనే గుర్తు చేసుకుంటున్నారు. కొందరు మహిళలు కంటతడి పెడుతూ మర్రి శ్రీనివాస్‌ రెడ్డిపై శాపనార్థాలు పెడుతున్నారు. రాష్ట్రంలో యువతులపై జరుగుతున్న దారుణాలపై హాజీపూర్‌ గ్రామంలో ప్రజలందరూ శ్రీనివాస్‌రెడ్డి అకృత్యాలపై చర్చించుకుంటున్నారు. 

అక్టోబర్‌ నుంచి హాజీపూర్‌ కేసు కోర్టులో విచారణ
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ గ్రామంలో ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసు అక్టోబర్‌ 10వ తేదీన నల్లగొండ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారణ ప్రారంభమైంది. బాధిత కుటుంబ సభ్యులు, పలువురు గ్రామస్తులు, జిల్లా పోలీస్‌ అధికారులతో పాటు మండల రెవెన్యూ అధికారులకు 120 మందికి కోర్టు సమన్లు అందాయి. సైకో శ్రీనివాస్‌రెడ్డి హాజీపూర్‌ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై అఘాయిత్యాలకు పాల్పడి హత్య చేసిన కేసులో వరంగల్‌ సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిపై కేసులు నమోదైన 90 రోజుల అనంతరం జూలై 31న యాదాద్రి భునవగిరి ఏసీపీ భుజంగరావు నల్లగొండ పోక్సో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

చట్టాలు కఠినంగా లేకపోవడంతోనే..
నేరాలకు పాల్పడే వారిపై చట్టాలు కఠినంగా లేకపోవడంతోనే నేరాలు పెరుగుతున్నాయి. ఇతర దేశాల మాదిరిగా నేరం చేసిన వారికి తక్షణమే శిక్షలు పడే వ్యవస్థ రావాలి. కోర్టులు, పోలీసులు విచారణలంటూ జాప్యం చేస్తే చట్టంలో ఉన్న లోసుగులు నేరస్తులకు తప్పించుకునే వెసులుబాటు దొరుకుతుంది. హాజీపూర్‌ కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఇప్పటికే శిక్ష పడితే ఇతర ప్రాంతాల్లో నేరం చేయాలనే వ్యక్తులకు కనువిప్పు కలిగేది.
– దాసరి జంగారెడ్డి, హాజీపూర్‌

బతకనివ్వొద్దు
జైలుకు వెళ్లయినా సరే శ్రీనివాస్‌ రెడ్డిని చంపాలనే కసి ఉంది. ముగ్గురు పిల్లలను పాడు చేసిన వాళ్ల పానాలు తిన్న శ్రీనివాస్‌ రెడ్డిని జైలుకు వెళ్లిన సరే చంపేయాలన్నా కసిగా ఉంది. ఇలాంటి రాక్షసులను భూమి మీద బతకనివ్వొద్దు. శ్రీని వాస్‌ రెడ్డి దారుణాలలో కుటుంబ సభ్యుల పాత్ర ఉంది. వారికి ఉన్న ఆస్తులను అమ్మి గ్రామాభివృద్ధికి వినియోగించాలి.  
– గోండ్రు జయమ్మ హాజీపూర్‌

రక్షణ కరువైంది..
హాజీపూర్‌లో జరిగిన ఘోరాలు మరవలేకపోతున్నాం. తప్పు చేసినోన్ని ఎన్ని రోజులు మేపుతారు. నెలలు గడుస్తున్నా నేటికీ భయంగానే ఉంది. ఎక్కడ చూసినా  ఆడోళ్లకు రక్షణ లేకుండా పోయింది. శ్రీనివాస్‌ రెడ్డికి శిక్ష పడితేనే కొంత ఉపశమనం కలుగుతుంది. సర్కారోళ్లు నేరస్తుల పట్ల కఠినంగా ఉండకనే కొత్తోళ్లు తయారవుతున్నారు.  
– పరిధ దుర్గమ్మ, హాజీపూర్‌

ప్రజలకు అప్పగిస్తే బాగుండు..
ఆడ పిల్లల ఉసురు తీసిన మర్రి శ్రీనివాస్‌ రెడ్డిని సంఘటన జరిగినప్పడే ప్రజలకు అప్పగిస్తే బాగుండే. ఊరోళ్లే సరైన శిక్ష వేసేటోళ్లు. జైళ్లలో కూసపెట్టి సాదుడు ఎందుకు ఇదివరకే సావ కొడితే ఆడోళ్ల దిక్కు చూసేటోళ్లు ఉండకపోదురు. ప్రజలందరికీ ఎప్పటికి గుర్తుండే శిక్షపడితే తప్పు చేసేటోళ్లకు సిగ్గొస్తది.  
– దాసరి చంద్రారెడ్డి, హాజీపూర్‌ 

ఉరిశిక్షే సరైంది
నిందితుడు సైకో శ్రీనివాస్‌ రెడ్డికి ఉరి శిక్షే సరైంది. అతని పేరు వింటేనే ఆడపిల్లలు ఉలిక్కి పడే పరిస్థితి ఉంది. గ్రామంతో పాటు మండల ప్రజలందరూ నిందితుడికి బహిరంగంగా శిక్ష విధించాలని కోరుతున్నారు. అతనికి పడిన శిక్షతోనే చిన్నారుల ఆత్మలు శాంతిస్తాయి. 
– పక్కీరు రాజేందర్‌రెడ్డి, హాజీపూర్‌

విచారణలో వేగం పెరిగింది
హాజీపూర్‌ బాలి కల వరుస హత్య ల కేసులో విచారణలో వేగం పెరి గింది. ఈ కేసుల్లో ప్రథమంగా బలైన తుంగని కల్పన కేసు మూడేళ్ల క్రితం నాటిది కావడంతో కొంత జాప్యం జరి గింది. నేటికీ 100 మందికి పైగా సాక్షులను కోర్టు విచారణ చేసింది. మరికొంత మందిని విచారణ చేయాల్సి ఉంది. మరో రెండు వారాల పాటు కోర్డులో సాక్షుల విచారణ జరిగే అవకాశం ఉంది. అనంతరం నిందితుడికి కోర్డు శిక్షను ఖరారు చేయనుంది. మహిళలు, యువతులు పోలీసులు వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అవగాహన పెంచుకోవాలి. స్మార్ట్‌ ఫోన్‌లలో యువత మహిళల రక్షణ కోసమే రూపొందించిన హాక్‌–ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ మేరకు అన్ని కళాశాలల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– ఏసీపీ భుజంగరావు, హాజీపూర్‌ బాలికల హత్య కేసుల విచారణ అధికారి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా