కూతురి వైద్యమంటే.. ట్రిపుల్‌ తలాక్‌!

7 Jan, 2018 13:32 IST|Sakshi

లక్నో : ఓవైపు ట్రిపుల్‌ తలాక్‌ను క్రిమినల్‌ నేరంగా పరిగణించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న వేళ.. దేశవ్యాప్తంగా షరా మాములుగా ట్రిపుల్‌ తలాక్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే బిల్లు వార్తల్లో నిలుస్తున్న తరుణంలో అలాంటి కేసులు ఇంకా ఎక్కువ నమోదు అవుతుండటమే ఇక్కడ గమనించదగ్గ అంశం. 

ఉత్తర ప్రదేశ్‌లో శనివారం ఒక్క రోజే రెండు ట్రిపుల్‌ తలాక్‌ వ్యవహారాలు వెలుగుచూశాయి. గోండా ప్రాంతంలో ఓ మహిళకు తన భర్త మూడుసార్లు తలాక్‌ చెప్పి వెళ్లగొట్టాడని మీడియా ముందు వాపోయింది. వికలాంగురాలైన కూతురి చికిత్స కోసం డబ్బులు అడిగితే.. తన భర్త ఈ చర్యకు పాల్పడ్డాడని ఆమె వాపోయింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె మత పెద్దలను, పోలీసులను కోరుతోంది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు.

ఇక మరో ఘటనలో దుబాయ్‌లో ఉంటున్న ఓ వ్యక్తి భార్యకు ఫోన్‌లో సందేశం ద్వారా ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి విడాకులు ఇచ్చేశాడు. సుల్తాన్‌పూర్‌కు చెందిన రుబినా బానోకు, హఫీజ్‌ ఖాన్‌కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త యూఏఈలో ఉద్యోగం చేస్తుండగా.. ఆమె అత్తవారింట్లో ఉంటోంది. అయితే గత కొంత కాలంగా అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే రుబినా ఫోన్‌కు హఫీజ్‌ ట్రిపుల్‌ తలాక్‌ సందేశం పంపటంతో ఆమె షాక్‌ తింది. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు భర్త తనకు విడాకులు ఇచ్చి ఉంటాడని ఆమె భావిస్తోంది. గత రెండు నెలల్లో యూపీలో ట్రిపుల్‌ తలాక్‌ కేసులు 30 దాకా నమోదు కావటం గమనార్హం.

రుబినా బానో ఫోటో

ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు ప్రకారం 'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్'ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. అది ఏ రూపకంలో(ఫోన్‌ సందేశం, సోషల్‌ మీడియా ద్వారా అయినా) ఉన్నా సరే నేరమే. దీని కింద ఒక ముస్లిం పురుషుడికి అత్యధికంగా మూడేళ్ల జైలుశిక్ష విధించవచ్చు. అంతే కాకుండా భర్త ఆ కాలంలో బాధితురాలికి భరణాన్ని కూడా చెల్లించాలి. లోక్‌సభలో బిల్లుకు క్లియరెన్స్‌ లభించగా.. రాజ్యసభలో ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది.

మరిన్ని వార్తలు