చేనేత కార్మికుడు దారుణ హత్య

22 Jan, 2019 12:04 IST|Sakshi
హతుడి భార్య మాధవిని విచారణ చేస్తున్న డీఎస్పీ చిదానందరెడ్డి

హతుడు అనంతపు జిల్లా వాసి

పలు కేసుల్లో ముద్దాయి

చిత్తూరు, మదనపల్లె సిటీ: చేనేత కార్మికుడు దారుణ హత్యకు గురైన సంఘటన సోమవారం నీరుగట్టువారిపల్లె సమీపంలోని కాట్లాటపల్లె రోడ్డులో వెలుగులోకి వచ్చింది.  చేనేత కార్మికుడు పవన్‌కుమార్‌ను ఆగంతకులు గొంతు కోసి హత్య చేశారు.  హతుడు అనంతపురం జిల్లాలో పలు దొంగతనాల కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ...అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పెడబల్లికోటకు చెందిన ఎ.పవన్‌కుమార్‌ (29) చేనేత కార్మికుడిగా పని చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం మాధవిని వివాహం చేసుకున్నాడు.

ఏడాది క్రితం నీరుగట్టువారిపల్లెకు నివాసం మార్చి, మగ్గం నేస్తూ జీవిస్తున్నాడు. నీరుగట్టువారిపల్లెలోని నివసిస్తున్న ధర్మవరానికి చెందిన సిద్ధు అనే చేనేత కార్మికుడితో హతుడికి ఇటీవల  పరిచయమైంది. ఆదివారం మధ్యాహ్నం సిద్ధుతో కలిసి సినిమాకు వెళుతున్నట్లు తనకు భార్యకు చెప్పి పవన్‌కుమార్‌ వెళ్లాడు. రాత్రి కావస్తున్నా ఇంటికి రాకపోవడంతో మాధవి తన భర్తకు ఫోన్‌ చేసింది. తనకు పని ఉందని, ఆలస్యంగా వస్తానని ఆమెకు చెప్పాడు. ఈ నేపథ్యంలో, అతను దారుణ హత్యకు గురై ఉండటం ఉదయం కాట్లాటపల్లె రోడ్డులో వెలుగుజూసింది.  స్థానికులు ఇది గుర్తించి మాధవికి తెలియజేశారు. హుటాహుటిన ఆమె అక్కడికి చేరుకుంది. రక్తపుమడుగులో ఉన్న భర్త మృతదేహాన్ని చూసి భోరున విలపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. మాధవి ఫిర్యాదు మేరకు రూరల్‌ సీఐ  కేసు నమోదు చేశారు.

హతుడి భార్యను విచారణ చేసిన డీఎస్పీ
హత్యోదంతం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి, వన్‌టౌన్‌ సీఐ నిరంజన్‌కుమార్‌ హతుడి భార్యను విచారణ చేశా>రు. త్వరలో హత్య కేసును ఛేదిస్తామన్నారు. ఇదలా ఉంచితే, పవన్‌కుమార్‌ హత్యపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. స్నేహితులు కలిసి హత్య చేశారా ? లేక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు