మృగాళ్లకు 'ఉరి'

14 Feb, 2020 12:03 IST|Sakshi
ఉరిశిక్ష పడిన ఇద్దరు నిందితులను కోర్టు నుంచి తీసుకెళుతున్న పోలీసులు

మరో కిరాతకునికి మరణదండన

రెండు కేసుల్లో న్యాయస్థానాల తీర్పు

వృద్ధాప్యానికి చేరువలో ఉన్న మహిళ అనే కనికరంకూడా లేకుండా కామంతో కళ్లు మూసుకుపోయాయి.పశువుల్లా మీదపడి తమవాంఛ తీర్చుకున్నారు. ఆపై అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు. అంతటితో ఆగకుండాబంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఈ మృగాళ్లపై న్యాయదేవత కన్నెర్ర జేసింది. ఇద్దరు నిందితులకు ఉరిశిక్ష విధించింది.వన్‌సైడ్‌ లవ్‌తో వెంబడించి వేధించినా ససేమిరా అనడంతో సైకోలా మారి యువతిని దారుణంగా హత్యచేసినయువకుడికి మరణదండన విధించింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరునెల్వేలి జిల్లా అంబై సమీపం కల్లిడైకురిచ్చికి చెందిన తమిళ్‌సెల్వి (50) పనిమాత్తురై ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నర్సుగా పనిచేసేది. నర్సు కుమారుడు రాజేష్‌కన్నన్‌ కోయంబత్తూరులో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. భర్త చెల్లస్వామి మరణించాడు. ఈ స్థితిలో ఆమె ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. 2008 సెప్టెంబర్‌ 29వ తేదీన రాత్రి నర్సు ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా ఆరుగురు అగంతకులు లోనికి ప్రవేశించారు. పెద్దగా అరిచేందుకు ప్రయత్నించగా నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత పదునైన వైరుతో గొంతుబిగించి హతమార్చారు. ఇంట్లో ఉన్న 25 గ్రాముల బంగారు నగలు దొంగలించుకుని పారిపోయారు. ఇంటి తలుపులు ఎంతకూ తెరుచుకోకపోవడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా నర్సు రక్తపు మడుగులో విగతజీవిగా పడిఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి కార్తిక్‌ (21), మహేంద్రన్‌ (24), వసంతకుమార్‌ (30), రాజేష్‌ (27), గణేశన్‌ (51), చిన్నదురై (27)ను అరెస్ట్‌ చేశారు. డీఎన్‌ఏ పరిశోధనలో వసంతకుమార్, రాజేష్‌ అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారణయ్యింది. ఈ కేసుపై బుధవారం తీర్పు వెలువడనుందని తెలియడంతో కోర్టు పరిసరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. గట్టి బందోబస్తు నడుమ ఆరుగురు నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులు వసంతకుమార్, రాజేష్‌కు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఇంద్రాణి బుధవారం సాయంత్రం తీర్పు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగైన నర్సు ఇంట్లోకి జొరబడినందుకు యావజ్జీవం, హత్యచేసినందుకు ఉరిశిక్ష, అత్యాచారానికి పాల్పడినందుకు 10 ఏళ్ల జైలుశిక్ష విధించారు. మిగిలిన నలుగురు నిందితులను నిర్దోషులుగా విడిచిపెట్టారు. 

ప్రేమ పెళ్లి వద్దన్నందుకు..
కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి సమీపం జ్యోతినగర్‌కు చెందిన తంగదురై (32) అదే ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. అతడి ప్రేమను ఆమె నిరాకరించింది. వీడవకుండా ఆమె వెంటపడుతూ వేధించ సాగాడు. యువతి తల్లిదండ్రులు పొల్లాచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తంగదురైని స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించగా ఇకపై ఆమె వెంటపడను అంటూ హామీ పత్రం రాసివ్వడంతో విడిచిపెట్టారు. ఇదిలా ఉండగా 2014 నవంబర్‌ 13వ తేదీన తంగదురై సదరు యువతి ఇంట్లోకి జొరబడి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడిచేశాడు. ఆగ్రహించి వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచి చంపాడు. అడ్డువచ్చిన ఆమె తల్లి, సోదరుడిని కత్తితో గాయపరిచాడు. హత్య, హత్యాయత్నం సెక్షన్ల కింద పొల్లాచ్చి పోలీసులు తంగదురైని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఈ కేసుపై కోయంబత్తూరు కోర్టు బుధవారం తీర్పుచెప్పింది. నిందితుడు తంగదురై ప్రాణాలు పోయే వరకు జైల్లోనే ఉండేలా యావజ్జీవ శిక్ష విధించింది. తల్లి, సోదరుడిపై దాడికి పాల్పడిన నేరానికి తలా ఏడేళ్ల జైలు, హద్దుమీరి ఇంట్లోకి ప్రవేశించినందుకు 10 ఏళ్ల జైలు, రూ.41వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పూర్ణజయ అనంద్‌ తీర్పు చెప్పారు.

మరిన్ని వార్తలు