డమ్మీ ఉరి పూర్తి, 20న ఉరి శిక్ష అమలు? 

18 Mar, 2020 20:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2012 నిర్భయ సామూహిక​ హత్యాచార కేసులో  దోషుల ఉరి శిక్ష అమలుకు  సర్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం తలారి  పవన్‌  జల్లాద్‌ డమ్మీ ఉరి కార‍్యక్రమాన్ని నిర్వహించారు. మార్చి 20 న ఉరి తీయడానికి రెండు రోజుల ముందే తీహార్ జైలులో నలుగురు మరణశిక్షకు సంబంధించి డమ్మీ ఉరిని నిర్వహించినట్టు  తలారి పవన్ బుధవారం తెలిపారు. మంగళవారం మీరట్ నుండి వచ్చి తాడులను పరీక్షించడానికి డమ్మీ ఉరిశిక్షను అమలు చేశామన్నారు.

తీహార్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో మరోసారి అన్ని సన్నాహాలతో, బుధవారం 'డమ్మీ ట్రయల్' జరిగినట్టు తీహార్ జైలు అదనపు ఇన్స్పెక్టర్ జనరల్ రాజ్ కుమార్ తెలిపారు.  జైలు నెంబర్ -3 ఉరి గదిలో జైలు అధికారుల సమక్షంలో  దీన్ని నిర్వహించామని,  ఉరి శిక్ష అమలుకు ముందు ఇలాంటి పరీక్షలు సాధారణమైన విషయమని ఆయన తెలిపారు. తద్వారా ఉరి సమయంలోఎటువంటి అవాంతరాలు  లేకుండా నిర్ధారించుకునేందుకు డమ్మీ ట్రయల్ ఉంటుందన్నారు. ఇది అరగంట పాటు కొనసాగిందని సీనియర్ అధికారి చెప్పారు. మరోవైపు శిక్ష ఖరారైనప‍్పటినుంచి దోషులు నలుగురు న్యాయ పరమైన అవకాశాలను వినియోగించు కుంటూ, శిక్ష  అమలుపై అవరోధాలతో మరణ శిక్షనుంచి విజయవంతంగా తప్పించుకుంటున్నారు.  తాజాగా విడాకులు ఇప్పించాల్సిందిగా  అక్షయ్‌ భార్య  పిటిషన్‌ దాఖలు చేసింది.  ఇది ఇలా వుంటే ఉరిశిక్ష అమలు పై స్టే విధించాలని కోరుతూ దోషులు మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో  ప్రభుత్వ న్యాయవాదికి నోటీసులు జారీ చేసిన కోర్టు, నిర్భయ దోషుల తాజా పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం విచారించనున్నట్లు పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి 20 ఉరి శిక్ష అమలవుతుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా అనేది  చర్చనీయాంశంగా మారింది.

కాగా  ఈ కేసులో  ఆరుగురు దోషలుగా తేలగా,  విచారణ ప్రారంభమైన కొన్ని రోజుల తరువాత తిహార్ జైలులో ఆరవ నిందితుడు రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి మైనర్‌ జువైనల్‌ హోంనుంచి విడుదలయ్యాడు. మిగిలిన దోషులు నలుగురు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31) లకు విధించిన ఉరిశిక్ష అమలు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. కోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 20న ఉదయం 5.30 గంటలకు  నలుగురు దోషులకు  శిక్ష అమలు కావాల్సి వుంది.

మరిన్ని వార్తలు