సరైన ఆధారాలు లేవంటూ పోలీసుల అలసత్వం

15 May, 2019 11:07 IST|Sakshi

లక్నో : పద్నాలుగేళ్లకే పెళ్లి.. ఓ బిడ్డ. తర్వాత భర్తతో విడాకులు. ఎక్కడికెళ్లాలో తెలియక పుట్టింటికి చేరింది. కానీ విధి మాత్రం ఆమెని పగబట్టింది. దాదాపు మూడేళ్ల పాటు మృగాళ్లు ఆమెను పీక్కు తిన్నారు. ఇక బతకలేననుకుని.. స్వయంగా తనకు తానే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. యూపీ హపూర్‌కు చెందిన 29 ఏళ్ల మహిళ మీద అదే గ్రామానికి చెందిన పలువురు యువకులు గత మూడేళ్ల నుంచి అత్యచారానికి పాల్పడుతున్నారు. సదరు మహిళ అప్పటికే భర్త నుంచి విడాకుల పొంది ఒంటరిగా జీవిస్తుంది. అలాంటి సమయంలో ఇలాంటి దారుణాల గురించి బయటకు చెప్తే సమాజం మరింత చులకన చేస్తుందని మృతురాలి భావించింది.

దాంతో ఆ దారుణాలను భరిస్తూ వచ్చింది. ఏళ్లు గడుస్తున్నా.. మృగాళ్లు తనను విడిచి పెట్టకపోవడంతో.. ఇక ఇలాంటి జీవితం వద్దనుకుంది. దాంతో తనకు తానే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ సంఘటన పట్ల పోలీసుల వ్యవహరించిన తీరు దారుణంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలి మరణించిన తర్వాత కూడా పోలీసులు కేసు నమోదు చేయడానికి ముందుకు రాలేదు. ఢిల్లీ మహిళా కమిషన్‌ ఈ విషయం గురించి యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు లేఖ రాయడంతోపాటు నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయడంతో పోలీసుల్లో చలనం మొదలైంది.

మహిళ చనిపోయిన 14 రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కానీ ఇంతవరకూ ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్‌ చేయలేదు. ఈ విషయం గురించి ఓ పోలీసాధికారి మాట్లాడుతూ.. ‘ఈ కేసుకు సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులను అందరిని ప్రశ్నించాము. ఓ 16 మందిని నిందితులుగా భావిస్తున్నాం. కానీ ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకూ ఒక్క ఆధారం కూడా లభించలేదు. దాంతో ఇంకా ఎవరిని అరెస్ట్‌ చేయలేద’ని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు