సీనియర్ల వేధింపులు : మెడికో ఆత్మహత్య

25 May, 2019 10:33 IST|Sakshi

సాక్షి,ముంబై : సీనియర్ల వేధింపులకు తాళలేక గైనకాలజీ పోస్ట్-గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు సీనియర్ వైద్యుల చేతిలో కులపరమైన వేధింపులకు ఎదుర్కొన్న మెడికో పాయల్‌ సల్మాన్‌ తద్వీ(26) హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నారు. ముంబై సెంట్రల్‌ బీవైఎల్‌ నాయర్‌ ఆసుపత్రిలోబుధవారం రాత్రి ఈ  సంఘటన చోటు చేసుకుంది. 

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం  జల్గావ్‌కు చెందిన డా. పాయల్‌  ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన అనంతరం బీవైఎల్‌ నాయర్‌ ఆసుపత్రిలో ఎండీ (గైనకాలజీ) చేస్తున్నారు. అయితే ఎస్సీ కులానికి చెందిన పాయల్‌పై  ముగ్గురు మహిళా డాక్టర్లు గత కొంతకాలంగా కులపరమైన వివక్ష చూపుతూ వేధింపులకు దిగారు.  రిజర్వ్‌డ్‌ కేటగిరీ అంటూ పలుసార్లు ఎద్దేవా చేసేవారు.  అంతేకాదు వాట్సాప్‌ గ్రూపులో ఆమెను తీవ్రంగా అవమానించేవారు. అయితే  ఈ వేధింపులపై  కాలేజీ యాజమాన్యానికి  ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లభించలేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో డిప్రెషన్‌కు గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సీనియర్‌ వైద్యుల వేధింపులు, యాజమాన్య నిర్లక్ష వైఖరి కారణంగా తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని పాయల్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

అయితే వేధింపులకు సంబంధించి తమకు రాతపూర్వక ఫిర్యాదు ఏదీ అందలేదని  ఆసుపత్రి సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. వివరాలను పరిశీలిస్తున్నామన్నారు. 

కులం పేరుతో వేధించేవారనీ,లంచ్‌ విరామంలో భోజనం చేయడానికి అనుమతినిచ్చేవారు కాదని పాయల్‌ సోదరుడు నీలేష్‌ ఆరోపించారు. అంతేకాదు ఎండీ కోర్స్‌ ఎలా పూర్తి చేస్తావో చూస్తామంటూ బెదరించేవారని తెలిపారు. కనీసం  భర్తను కలవడానికి కూడా పాయల్‌కు అనుమతినిచ్చేవారు కాదని ఆయన ఆరోపించారు. 

ఇదే హాస్పిటల్‌కు తాను ట్రీట్‌మెంట్‌కు వచ్చినపుడు పలుసార్లు వేధింపులకు పాల్పడ్డారని పాయల్‌ తల్లి, కాన్సర్‌తో బాధపడుతున్న అబీదా సలీం(53)  కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే విషయంలో  బుధవారం సాయంత్రం తనతో చెప్పుకుని బాధపడిందనీ, తాము వచ్చేలోపే అంతా జరిగిపోయిందని వాపోయారు. మరోవైపు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా హేమా ఆహుజా, భక్తి మెహరే, అంకిత ఖండేల్‌వాల్‌ అనే ముగ్గురు సీనియర్‌ డాక్టర్లపై పోలీసులు  కేసు నమోదు చేశారు.
 

మరిన్ని వార్తలు