బాలికను బావిలోకి తీసుకెళ్లి.. బాలికపై...

14 Oct, 2018 11:49 IST|Sakshi
బావిలో యువకుడు రాజేష్‌చారి, నిందితుడు రాజేష్‌చారిని తరలిస్తున్న పోలీసులు

జఫర్‌గఢ్‌(స్టేషన్‌ఘన్‌పూర్‌): ఇంటి ముందు నిల్చున్న ఓ బాలికను పక్కింటి యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లి సమీపంలోని పాడుబడిన వ్యవసాయ బావిలో పడేసి, అతడు కూడా అందులో దూకి అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. స్థానికులు చేరుకుని అతడిపై దాడికి యత్నించగా గ్రామంలో ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం ఉప్పుగల్లు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బాలిక హన్మకొండలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులు కావడంతో రెండు రోజు ల క్రితమే ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు శనివారం వ్యవసాయ పనులకు వెళ్లారు. బాలిక మధ్యాహ్నం ఇంటి ముందు నిల్చొని ఉంది.

గమనించిన పక్కింటి యువకుడు కేశోజు రాజేష్‌చారి(23) వచ్చి ఆమెను బలవంతంగా ఎత్తుకుని రోడ్డు అవతలకు వెళ్తుండగా పెద్ద పెట్టున కేకలు వేసింది. విన్న స్థానికులు వస్తుండగా రాజేష్‌చారి ఆ బాలికను సమీపంలోని పాడుబడిన బావిలో పడేశాడు. అతడు కూడా బావిలో దూకాడు. బాలిక తలకు, కాళ్లకు గాయాలైనప్పటికీ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బావి వద్దకు చేరుకున్న స్థానికులు పైనుంచి అతడిని బెదిరించి బాలికను తాళ్ల సాయంతో పైకి లాగారు. గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం వెంటనే 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

సమాచారం తెలుసుకున్న వర్ధన్నపేట ఏసీపీ మధుసూదన్, సీఐ కరుణాసాగర్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిపై గ్రామస్తులు దాడికి యత్నించగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఫైరింజిన్‌ను కూడా తెప్పించారు. నిందితుడిని ఆస్పత్రికి తరలించే క్రమంలో గ్రామస్తులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. కాగా నిందితుడు రాజేష్‌చారి ఇంటర్మీడియట్‌ చదువు ఆపేసి గ్రామంలోని ఇసుక డంపుల వద్ద రోజువారీ కూలిగా పనిచేస్తున్నాడు. అతడితోపాటు కుటుంబ సభ్యులు తరుచూ గొడవ పడేవారని, ఇతరులతో కూడా గొడవలకు దిగేవారని స్థానికులు తెలిపారు.

రాజేష్‌చారిపై కేసు నమోదు
ఉప్పుగల్లు గ్రామంలో బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి బావిలో పడేసి అత్యాచార యత్నానికి పాల్పడటంతోపాటు చంపేందుకు యత్నించాడనే ఫిర్యాదు మేరకు నిందితుడు కేశోజు రాజేష్‌చారిపై కేసు నమోదైనట్లు ఎస్సై వెంకటకృష్ణ శనివారం రాత్రి తెలిపారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయగా నిందితుడిని వెంటనే అరెస్ట్‌ చేసి 376, 366, 307 సెక్షన్ల కింద ఫోక్సో యాక్టు ప్రకారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు