రణరంగంగా కేరళ

4 Jan, 2019 03:30 IST|Sakshi
కైరాల్‌ టీవీ కెమెరావుమన్‌ ఫాతిమాను బెదిరిస్తున్న కార్యకర్త. కెమెరాతో షూట్‌ చేస్తూ కంటతడిపెట్టుకున్న ఫాతిమా

ఉధృతమైన ‘శబరిమల’ ఆందోళనలు

12 గంటల హర్తాళ్‌ హింసాత్మకం

పలుచోట్ల సీపీఎం కార్యాలయాలపై దాడులు

మీడియా ప్రతినిధులకూ తాకిన సెగ

బీడీ తయారీ కేంద్రంపై నాటుబాంబు వేసిన ఆందోళనకారులు

తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం కేరళను రణరంగంగా మార్చింది.  గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగిన హిందూ సంస్థల కార్యకర్తలు రోడ్లకు అడ్డంగా కాలిపోతున్న టైర్లు, గ్రానైట్‌ పలకలు ఉంచి నిరసనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.  శబరిమల కర్మ సమితి ఇచ్చిన 12 గంటల హర్తాళ్‌ పిలుపు మేరకు వందలాది మంది  హిందూ అనుకూల సంస్థల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. అధికార సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులకు కూడా నిరసనల సెగ తాకింది. ఆందోళనకారుల దాడిలో పలువురు పాత్రికేయులు గాయాలపాలయ్యారు.

పోలీసులు, సీపీఎం కార్యకర్తలతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగడంతో చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల వ్యవధిలో 266 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు 334 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించాలని గవర్నర్‌ పి. సదాశివం ముఖ్యమంత్రి విజయన్‌ను ఆదేశించారు. తాజా హింసకు బీజేపీ, ఆరెస్సెస్‌లే కారణమని విజయన్‌ ఆరోపించారు. మరోవైపు, శబరిమల ఆలయాన్ని ఇద్దరు మహిళలు దర్శించుకున్న తరువాత గర్భగుడిని శుద్ధిచేయడంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

బీజేపీ కార్యకర్తలకు కత్తిపోట్లు..
త్రిసూర్‌లో సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎస్‌డీపీఐ) కార్యకర్తలతో జరిగిన ఘర్షణలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కత్తిపోట్లకు గురయ్యారు. కోజికోడ్, కన్నూర్, మలప్పురం, పాలక్కడ్, తిరువనంతపురం తదితర పట్టణాల్లోనూ బీజేపీ, శబరిమల కర్మ సమితి కార్యకర్తల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ కేనన్స్‌ ప్రయోగించి, లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. పాలక్కడ్‌లో సీపీఎం కార్యాలయంపై దాడికి పాల్పడిన నిరసనకారులు, దాని ముందు నిలిపిన వాహనాల్ని ధ్వంసం చేశారు. కన్నూర్‌ జిల్లాలోని తాలసెరిలో సీపీఎం నిర్వహణలో ఉన్న బీడీ తయారీ కేంద్రంపై నాటుబాంబు విసిరారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న 10 మందిని పోలీసులు వెంటనే అరెస్ట్‌ చేశారు.

మీడియాపై దాడికి నిరసనగా తిరువనంతపురంలో పాత్రికేయులు ఆందోళనకు దిగారు. బీజేపీ, శబరిమల కర్మ సమితి కార్యక్రమాలను బహిష్కరించాలని కేరళ మీడియా వర్కింగ్‌ యూనియన్‌ నిర్ణయించింది. హర్తాళ్‌ వల్ల దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాలు మూతపడటంతో జనజీవనం స్తంభించింది. గురువారం కాంగ్రెస్‌ ‘బ్లాక్‌ డే’గా పాటించింది. పాతనంతిట్టా జిల్లాలోని పాండలమ్‌లో సీపీఎం కార్యకర్తలు తమ కార్యాలయ భవనం పైనుంచి రాళ్లు రువ్వడంతో తీవ్రంగా గాయపడిన 55 ఏళ్ల ఉన్నితాన్‌ చనిపోయారు. బుధవారం సాయంత్రం శబరిమల కర్మ సమితి చేపట్టిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ దాడిలో పాల్గొన్న 9 మందిని గుర్తించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఉన్నితాన్‌ గుండెపోటుతో మరణించాడని ముఖ్యమంత్రి విజయన్‌ వెల్లడించారు.

చెన్నైలో కేరళ సీఎం దిష్టిబొమ్మ దహనం
సాక్షి, చెన్నై: శబరిమల ఆందోళనలు చెన్నైకీ విస్తరించాయి. పల్లవరంలో బీజేపీ కార్యకర్తలు కేరళ సీఎం విజయన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ని అయ్యప్ప ఆలయంలోకి అనుమతించని కేరళ ప్రభుత్వం ఇద్దరు మహిళల్ని మాత్రం బందోబస్తుతో పంపిందని తమిళనాడు బీజేపీ చీఫ్‌ సౌందరరాజన్‌ విమర్శించారు.

హింస వెనక బీజేపీ, ఆరెస్సెస్‌: విజయన్‌
హర్తాళ్‌ మద్దతుదారులు హింసకు పాల్పడటం వెనక పక్కా ప్రణాళిక ఉందని సీఎం విజయన్‌ పేర్కొన్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌ హింసను ప్రేరేపించాయని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. శబరిమలకు వెళ్లిన ఇద్దరిని ప్రభుత్వం తీసుకెళ్లలేదని, వారు సాధారణ భక్తులలాగే ఆలయ సందర్శనకు వెళ్లారని చెప్పారు. వారిని హెలికాప్టర్‌లో తరలించారన్న వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ హర్తాళ్‌ చేయడమంటే సుప్రీంకోర్టు తీర్పును శంకించడమేనని పేర్కొన్నారు. మహిళల దర్శనం తరువాత ఆలయాన్ని శుద్ధిచేసిన పూజారుల తీరును కూడా విజయన్‌ తప్పుబట్టారు.


ఢిల్లీలో కేరళ సీఎం విజయన్‌ దిష్టిబొమ్మను దగ్ధంచేస్తున్న అయ్యప్ప ధర్మ సంరక్షక సమితి సభ్యులు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు