మురికి కాల్వలో చిన్నారి.. ప్రాణం పోసిన శునకాలు

20 Jul, 2019 16:58 IST|Sakshi

చండీగఢ్‌ : ఇంకా కన్ను కూడా తెరవని పసిపాపను నిర్దాక్షిణ్యంగా మురికి కాల్వలోకి విసిరేసింది ఓ కసాయి తల్లి. కానీ నోరు లేని మూగజీవులు ఆ బిడ్డను కాపాడి మానవత్వం చాటుకున్నాయి. ప్రస్తుతం ఆ చిన్నారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణం హరియాణలోని కైతాల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. సీసీటీవీ రికార్డులో ఉన్న దాని ప్రకారం శుక్రవారం ఓ మహిళ డోగ్రన్ గేట్ ప్రాంతంలో ఓ పసిపాపను ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి మురికి కాల్వలోకి విసిరి వెళ్లి పోయింది. అయితే కుక్కలు ఆ కవర్‌ను బయటకు తీసుకురావడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

ప్లాస్టిక్‌ కవర్‌లో పసిపాపను చూసి కుక్కలు అరుస్తూ.. బాటసారులను అప్రమత్తం చేశాయి. పసిబిడ్డను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. చిన్నారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. విసిరేయడం మూలానా చిన్నారి తలకు బలమైన గాయం అయినట్లు వైద్యులు తెలిపారు. త్వరలోనే నయమవుతుందన్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ దారుణానికి పాల్పడిన మహిళ గురించి ఆరా తీస్తున్నాం. త్వరలోనే ఆమెను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు