నా భర్తను చంపేశాను.. ఉరి తీయండి!

25 Dec, 2019 18:23 IST|Sakshi

చండీగఢ్‌: హర్యానా హోంమంత్రి అనిల్‌ విజ్‌ వద్దకు ఒక మహిళ ఏడుస్తూ వచ్చి.. 'నా భర్తను రెండు సంత్సరాల కింద హత్య చేశాను. నాకు ఉరిశిక్ష విధించండి' అని విన్నవించుకున్నారు. సోమవారం జరిగిన ఈ ఘటన అంబాలలో అందరిని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రజలు తమ సమస్యలను నివేదించేందుకు ఏర్పాటు చేసిన జంతర్‌ మంతర్‌ కార్యక్రమానికి వచ్చిన సునీల్‌ కుమారీ,  తన భర్తను హత్య చేశానని పశ్చాత్తాపడుతూ.. తాను చేసిన తప్పునకు శిక్ష విధించమని హర్యానా హోంమంత్రి అనిల్‌ విజ్‌ను లేఖలో వేడుకొన్నారు. సునీల్‌ కుమారీ కథనం మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు.


కాగా ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రోహ్తాష్‌ సింగ్‌, మద్యానికి బానిసై తరచూ తాగివచ్చి భార్య సునిల్‌ కుమారీని వేధింపులకు గురిచేసేవాడు. ఎప్పటిలానే జూలై15, 2017న కూడా అతిగా మద్యం సేవించి, దుర్భాషలాడుతూ.. మత్తులో తూలుతూ కింద పడిపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కుమారీ.. భర్తకు వాంతులు అవడం గమనించి.. అతడి నోటికి తన దుపట్టాను అదిమిపెట్టగా.. అతడు చనిపోయాడు. ఇక పోస్టుమార్టం నివేదికలోనూ రోహ్తాష్‌ వాంతి కారణంగానే ప్రాణాలు విడిచాడని వెల్లడవడంతో.. ఆమె శిక్ష నుంచి తప్పించుకున్నారు.  అయితే సునీల్‌ కుమారీ మాత్రం తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేక.. అతడిని హత్య చేశాననే అపరాధ భావాన్ని తట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో తానే హత్య చేశానంటూ హోంమంత్రి వద్ద మొరపెట్టుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు