అన్నం పెట్టిన దుకాణానికే కన్నం వేశాడు

8 Mar, 2018 07:56 IST|Sakshi
దొంగతనం జరిగిన నగల దుకాణం ఇదే

నగల షాపులో మూడు నెలలుగా గుమాస్త దొంగతనం

డమ్మీతాళంచెవితో నగదు,బంగారం అపహరణ

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న వ్యాపారి

 పోలీసులకు అప్పగింత

జమ్మికుంట(హుజూరాబాద్‌): అన్నంపెట్టిన దుకాణానికే కన్నం వేశాడు ఓ ఘనుడు. సాయంగా ఉంటాడని గుమాస్తాను పెట్టుకుంటే డమ్మీతాళం చెవి సృష్టించి రెండు నెలలుగా బంగారం, నగదు అపహరిస్తున్నాడు. బుధవారం యజమాని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. జమ్మికుంట పట్టణంలోని  గాంధీచౌక్‌ వద్ద కాసుల శేషు బంగారం దుకాణం ఉంది. యాజమాని శేషు పట్టణంలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన రామకృష్ణను నాలుగు మాసాల క్రితం గుమాస్తాగా పెట్టుకున్నాడు.

రామకృష్ణ షాపు కౌంటర్‌ తాళాలను పరిశీలించి యాజమాని లేని సమయంలో దొంగతనం చేసేందుకు కౌంటర్‌ తాళానికి డమ్మీ తాళం చెవిని తయారుచేశాడు. యాజమాని కౌంటర్‌కు తాళం వేసుకొని వెళ్లిన సమయంలో డమ్మీ తాళంచెవితో కౌంటర్‌ తాళాలు తీస్తూ్త అందులోని నగదు, బంగారం, వెండి వస్తువులు అపహరించేవాడు. ఈ విషయమై అనుమానం వచ్చిన శేషు అతడి కదలికలపై నిఘా పెట్టాడు.

బుధవారం సాయం త్రం శేషు బయటకు వెళ్లినట్లు నటించి దుకాణంలో ఉన్న గుమాస్తాను పరిశీలించాడు. ఇదే సమయంలో రామకృష్ణ జేబులో ఉన్న డమ్మీతాళం చెవితో కౌంటర్‌ తీసి అందులో రూ. 6వేల నగదు, కొంత బంగారాన్ని తీసి జేబులో పెట్టుకున్నాడు. గమనించిన వ్యాపారి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం పోలీసులకు అప్పగించాడు.  ఇప్పటి వరకు రూ. 50 వేల నగదు, రెండు కిలోల వెండి, 12జతల బంగారు కమ్మలు పోయినట్లు శేషు పోలీసులకు వెల్లడించాడు.  

మరిన్ని వార్తలు