అతను దొంగ కాదు  

26 May, 2018 10:23 IST|Sakshi
మతిస్థిమితం లేని వ్యక్తికి కటింగ్‌ చేయిస్తున్న పోలీసులు, అనంతరం నవ్వుతున్న సదరు వ్యక్తి 

మాల్‌చెర్వుతండాలో  స్థానికులు పట్టుకున్న వ్యక్తికి మతిస్థిమితం లేదు

సైకాలజిస్ట్‌ సహకారంతో విచారణ అనంతరం తేల్చిన పోలీసులు

దొంగలు సంచరిస్తున్నారన్న వదంతులు నమ్మొద్దని సూచన

అక్కన్నపేట(హుస్నాబాద్‌): బుధవారం మాల్‌చెర్వు తండాలో స్థానికులు దొంగగా భవించి పట్టుకున్న వ్యక్తికి మతిస్థిమితం లేదని పోలీసులు తేల్చారు. సైకాలజిస్టు, డాక్టర్‌ సహాయంతో పోలీసులు సుదీర్ఘంగా విచారణ చేశారు. చివరికి అతను దోపిడి దొంగలు, హంతక ముఠాలకు చెందిన అతను కాదని మతి స్థిమితం లేని వ్యక్తని నిర్ధారణకు వచ్చారు. 

పుకార్లు నమ్మొద్దు..

అక్కన్నపేట మండలంలో పిల్లలను ఎత్తుకెళ్లే వారు, దోపిడి దొంగలు సంచరిస్తున్నారన్న వార్తల్లో వాస్తవం లేదని హుస్నాబాద్‌ సీఐ శ్రీనివాస్‌ జీ అన్నారు. బుధవారం మాల్‌చెర్వుతండాలో స్థానికులు పిల్లలను ఎత్తుకెళ్లే దొంగగా భావించి పట్టుకున్న వ్యక్తికి మతిస్థిమితం లేక తప్పిపోయి వచ్చాడన్నారు. బీహార్‌కు చెందిన ముఠాలు సంచరిస్తున్నారని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలన్ని ఉత్త పుకార్లే అని కొట్టిపారేశారు. ఆయన వెంట ఎస్‌ఐ పాపయ్యనాయక్‌ ఉన్నారు.

మానవత్వం చాటిన పోలీసులు..

మాల్‌చెర్వుతండా వాసులు పట్టుకున్న మతి స్థిమితం వ్యక్తికి పోలీసులు కటింగ్, స్నానం చేయించి, కొత్త బట్టలు వేయించి మానవత్వం చాటారు. అనంతరం భువనగిరి జిల్లాలోని చౌటుపల్లిలోని అమ్మానాన్న ఆశ్రమానికి సొంత ఖర్చులతో తరలించారు.


 

మరిన్ని వార్తలు