కోచింగ్‌ కోసం వెళ్లి.. ప్రేమోన్మాదిగా మారి!

10 Jul, 2019 06:56 IST|Sakshi

వెంకటేష్‌ది నారాయణరెడ్డిపేట

ఇంజినీరింగ్‌ పూర్తి

బ్యాంక్‌ కోచింగ్‌ కోసం హైదరాబాద్‌కు..

కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు

సాక్షి, నెల్లూరు రూరల్‌: చిన్నప్పటి నుంచి కష్టాన్ని దగ్గరగా చూస్తూ పెరిగాడు. ఉన్నతచదువులు చదివి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలవాలనుకున్న ఆకాంక్ష అతనిని విద్యాధికుడిని చేసింది. తలకుమించిన భారం అయినప్పటికీ  బ్యాంకు(ఐఎస్‌డబ్ల్యూ) కోచింగ్‌ కోసం హైదరాబాద్‌ వెళ్లాడు. ప్రేమలో పడి ఉన్మాదిగా మారి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇది దిల్‌సుఖ్‌నగర్‌లో యశస్విని గొంతుకోసిన ప్రేమికుని నేపథ్యం. నెల్లూరు రూరల్‌ మండలం నారాయణరెడ్డిపేటకు చెందిన జనార్దన్‌ , ప్రసూన్నమ్మ దంపతులకు వెంకటేష్‌. సునీల్‌ కుమారులు. జనార్దన్‌ వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన లాగే తన బిడ్డలు కష్టపడకూడదని తలకు మించిన భారం అయినప్పటికీ ఉన్నంతలోనే చదివించాలని నిశ్చయించుకున్నాడు.

సంపాదించిన దాంట్లో కొంత వారి చదువులకు వెచ్చించాడు. చిన్నప్పటినుంచి తల్లిదండ్రులు కష్టాలను చూస్తూ పెరిగిన వెంకటేష్‌ చదువుల్లో రాణించి వారికి చేదోడువాదోడుగా నిలవాలన్న లక్ష్యంతో చదువుల్లో రాణించాడు. రాయ వేలూరులో బీటెక్‌ పూర్తిచేశాడు. అతని తమ్ముడు సునీల్‌ ప్రస్తుతం బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతన్నాడు. బీటెక్‌ పూర్తిచేసుకున్న వెంకటేష్‌ ఐదునెలల కిందట బ్యాంకు కోచింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ కోచింగ్‌ తీసుకుంటున్న సమయంలో యశస్వినితో పరిచయం పెరిగింది. తర్వాత ఆమె అతనిని దూరంపెట్టడం, ప్రేమోన్మాదిగా మారి ఆమె గొంతుకోశాడు. తాను ఈ లోకంలో జీవించకూడదని నిశ్చయించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో వెంకటేష్‌ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

కేన్సర్‌ వ్యాధిని దాచిపెట్టి...
కొంతకాలంగా ప్రసూన్నమ్మ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆమెను పరీక్షించిన వైద్యులు కేన్సర్‌ వ్యాధి అని నిర్ధారించారు. ఎక్కడ ఈ విషయం కొడుకుకు తెలిస్తే చదువు మీద దృష్టిపెట్టడని భావించిన తల్లిదండ్రులు దాచిపెట్టారు. ఇటీవల ప్రసూన్నమ్మ హైదరాబాద్‌లోని బసవతారకం హాస్పిటల్‌లో చికిత్స చేయించుకుని కుమారుడ్ని కలిసింది. బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని చెప్పి నెల్లూరుకు తిరిగి వచ్చింది. తన కొడుకు బాగా చదువుకుంటున్నాడని, త్వరలోనే ఉద్యోగం వస్తుందని మా బతుకులు బాగుపడుతాయని తెలిసిన వారందరికీ తల్లిదండ్రులు చెప్పి పొంగిపోయారు. 

కన్నీరు మున్నీరుగా....
మంగళవారం వెంకటేష్‌ ప్రేమోన్మాదిగా మారి మనశ్విని గొంతు కోసి తాను ఆత్మహత్యచేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న జనార్దన్, ప్రస్నూమ్మ కుప్పకూలిపోయారు. కొడుకును తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. చేతికందివచ్చిన కుమారుడు ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండడం వారు జీర్ణించుకోలేకపోయారు. అదేక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి వెంకటేష్‌ ఇలా అంటూ వారిని ప్రశ్నించడంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇంటికి తాళంవేసి వెళ్లపోయారు. మంగళవారం రాత్రి వెంకటేష్‌ తల్లిదండ్రులు హైదరాబాద్‌ వెళుతున్నారని స్థానికులు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు