ఠాణాలో హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

30 Jan, 2020 02:32 IST|Sakshi

బ్యారక్‌లో ఉరేసుకున్న లచ్చాగౌడ్‌

పని ఒత్తిడా? వ్యక్తిగత సమస్యలా?

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ

మృతదేహాన్ని చూడనివ్వని పోలీసులు

స్థానికుల ఆందోళన.. ఉద్రిక్తత

మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన పంతం లచ్చాగౌడ్‌ (57) మాచారెడ్డి పోలీస్‌ స్టేషన్లో మూడేళ్లుగా హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఉదయం 10 గంటలకు సెక్షన్‌ ఇన్‌చార్జిగా విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో డ్యూటీ లేకున్నప్పటికీ స్టేషన్‌కు వచ్చి సహచరులతో కొద్దిసేపు మాట్లాడారు. 2.30 గంటల ప్రాంతంలో స్టేషన్‌ వెనుక భాగంలో ఉన్న బ్యారక్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కొద్దిసేపటి తర్వాత గమనించిన తోటి కానిస్టేబుళ్లు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

ఎస్పీ శ్వేత ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. లచ్చాగౌడ్‌ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అయితే హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పని ఒత్తిడా..?, లేక వ్యక్తిగత సమస్యలా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా, లచ్చాగౌడ్‌ 1990లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరాడు. నిజామాబాద్‌ జిల్లాలోని మోర్తాడ్‌ పోలీస్‌స్టేషన్‌లో చాలాకాలం పనిచేశాడు. ఆ తర్వాత దాదాపు 21 సంవత్సరాలు రైల్వేశాఖలో విధులు నిర్వహించాడు. కొంతకాలం నిజాంసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసి 2017 ఫిబ్రవరి నుంచి మాచారెడ్డి పీఎస్‌లో పనిచేస్తున్నాడు. 2015లో హెడ్‌కానిస్టేబుల్‌ ప్రమోషన్‌ పొందాడు. మృతుడికి భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

స్థానికుల ఆందోళన
అందరితో కలివిడిగా ఉంటూ అప్యాయంగా పలకరించే లచ్చగౌడ్‌ ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు నిర్ఘాంతపోయారు. పోలీస్టేషన్‌కు తరలివెళ్లి లచ్చాగౌడ్‌ మృతదేహాన్ని చూడనివ్వాలని పట్టుబడ్డారు. పోలీసులు అంగీకరించక పోవడంతో ఆందోళనకు దిగారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ స్థానికులను సముదాయించి మృతదేహాన్ని కామారెడ్డికి తరలించారు.

మరిన్ని వార్తలు