నెత్తురోడిన రహదారులు

23 Mar, 2019 12:19 IST|Sakshi
నజీర్, మహేష్‌బాబు మృతదేహాలు

సాక్షి, నార్కట్‌పల్లి (నకిరేకల్‌) : రహదారులు మరో మారు నెత్తురోడాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నార్కట్‌పల్లి, చివ్వెంల, రామన్నపేట, తిప్పర్తి మండలాల్లో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు..  నల్లగొండకు చెందిన మందడి సత్యపాల్‌రెడ్డి (30) తన స్నేహితుడి మేడి శ్రీనివాస్‌ సోదరి గ్రామం కట్టంగూర్‌ మండలం పామనగుండ్లకు కారులో వెళ్లారు. రాత్రి తిరిగి నల్లగొండకు బయలు దేరారు. అయితే నార్కట్‌పల్లి వద్ద వీరు ఫైఓవర్‌ దిగకుండా అలాగే ముందుకు వెళ్లారు.

వారిజాల వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లే ఆర్చి వద్ద యూటర్న్‌ తీసుకుంటుండగా సూర్యాపేట  నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యపాల్‌రెడ్డి మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. 

సీటు బెల్ట్‌ పెట్టుకుని ఉంటే..
కారులో ప్రయాణిస్తున్న సత్యపాల్‌రెడ్డి సీట్‌ బెల్ట్‌ పెట్టుకుని ఉంటే మృతిచెందే వాడు కాదని ఘటనాస్థలిని పరిశీలిస్తే అవగతమవుతోంది. శ్రీనివాస్‌ సీట్‌ బెల్ట్‌ పెట్టుకుని డ్రైవింగ్‌ చేస్తుండడంతో ప్రమాదం జరిగినప్పుడు బెలూన్స్‌ ఓపెన్‌ కావడంతో అతడు గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణమైన మరో కారులో ప్రయాణిస్తున్న వారు సీటు బెల్ట్‌ పెట్టుకోవడం వల్ల బెలున్స్‌ ఓపెన్‌ కావడంతో స్వల్పగాయాలతో బయటపడినట్టు పోలీసులు తెలిపారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని.. 
చివ్వెంల (సూర్యాపేట) : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆళ్లగడప గ్రామానికి చెందిన నిమ్మల సోమ య్య (45) తన కుమారుడి పెళ్లి కార్డులు పంచేందుకు కోదాడ వెళ్లి తిరిగి సూర్యాపేటవైపు మోపెడ్‌పై వస్తున్నాడు. మార్గమధ్యలో గుంజలూరు గ్రామ స్టేజి వద్ద  విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న గుర్తుతెలియన వాహనం వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోమయ్య కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బం ధువులకు అప్పగించారు. మృతుడి కుమారుడు నరేశ్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ లవకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కారు – లారీ ఢీ.. ఒకరు..
రామన్నపేట (నకిరేకల్‌) :  నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జునకాలనీకి చెందిన తల్లం నవీన్‌(33) శుక్రవారం రామన్నపేటలో నివాసం ఉంటున్నతన స్నేహితుడిని కలువడానికి వచ్చాడు. అనంతరం స్నేహితుడి కారు తీసుకుని భువనగిరి వైపు వెళ్తుండగా ఇంద్రపాలనగరం శివారులోని సబ్‌స్టేషన్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవీన్‌ను 108 వాహనంలో రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం అతడిని నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. మృతుడి బాబాయి ప్రకాష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సీహెచ్‌ సాయిలు తెలిపారు. 

మినీగూడ్స్‌ బోల్తా ..ఇద్దరు..
తిప్పర్తి (నల్లగొండ) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నెల్లురు జిల్లా లింగసముద్రం మండలానికి చెందిన  మహేష్‌బాబు(30)మినీ గూడ్స్‌ డ్రైవర్‌గా,షేక్‌ నజీర్‌(35) ఇదే వాహనానికి క్లినర్‌గా పనిచేస్తున్నాడు. సింగరాయకొండ నుంచి కూల్‌ బాక్స్‌లను లోడ్‌ చేసుకుని జహీరాబాద్‌లో ఆన్‌లోడ్‌ చేసి తిరిగి నెల్లురు వెళ్తున్నారు. మార్గమధ్యలో మండల పరిధిలోని రామలింగాలగూడెం వద్ద ఒక్కసారిగా ముందు టైర్‌ పగలడంతో అదుపుతప్పి మినీగూడ్స్‌ డివైడర్‌ దాటి అటు వైపు నుంచి వస్తున్న లారీని ఢీకొట్టి డివైడర్‌పై పడింది. దీంతో మినీగూడ్స్‌లో ఉన్న డ్రైవర్, క్లినర్‌ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతుల బందువులకు సమాచారం అందజేశారు.  మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధు తెలిపారు. 

మరిన్ని వార్తలు