నగరంలో మళ్లీ డ్రగ్స్‌ అలజడి

27 Mar, 2018 02:53 IST|Sakshi
నార్కొటిక్‌ డ్రగ్స్‌తో పోలీసులకు పట్టుబడ్డ గ్యాంగ్‌

ముంబై నుంచి నగరానికి భారీగా సరఫరా

ఈవెంట్‌ మేనేజర్‌ రఫత్‌కు అందజేసే క్రమంలో పట్టుకున్న ఎస్‌వోటీ

నలుగురి అరెస్టు, రూ.2 లక్షల విలువ చేసే హెరాయిన్, కొకైన్‌ స్వాధీనం 

హైదరాబాద్‌: నగరంలో మళ్లీ మాదకద్రవ్యాల అలజడి కనిపించింది. నయా వేడుకలే కాకుండా నగరంలో వారాంతాల్లో జరిగే పార్టీలకు మాదకద్రవ్యాలు సరఫరా చేసే కొన్ని ముఠాల పనిపట్టిన సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు.. తాజాగా ముంబై నుంచి నగరానికి భారీగా డ్రగ్స్‌ తీసుకొచ్చి విక్రయించేందుకు యత్నించిన నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి మార్కెట్‌లో రూ.2 లక్షల విలువచేసే 31 కొకైన్, ఎండీఎంఏ హెరాయిన్‌ ప్యాకెట్లతో పాటు ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను బాలానగర్‌ ఏసీపీ గోవర్ధన్‌ సోమవారం మీడియాకు వివరించారు.  

విలాసవంత జీవితం కోసం.. 
పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహ్మద్‌ అఫ్తబ్‌ అలమ్‌ అలియాస్‌ షాలి అలియాస్‌ పప్పు (38) విలాసవంత జీవితానికి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో డబ్బు సంపాదనకు ముంబైలోని ముజ్రా పార్టీలకు డ్యాన్సర్లతో పాటు మాదకద్రవ్యాలను కూడా సరఫరా చేస్తుండేవాడు. ఇది తెలిసిన మటన్‌ షాప్‌ యజమాని ఇమామ్‌ అలీ ఖురేషీ తనతో సన్నిహితంగా ఉండే నైజీరియన్లకు అఫ్తబ్‌ అలమ్‌ ద్వారా డ్రగ్స్‌ సరఫరా చేస్తుండేవాడు. అయితే అఫ్తబ్‌ తమ రాష్ట్రానికి చెందిన షమీమ్‌ అలమ్‌ను మాదకద్రవ్యాలు సరఫరా చేసే సహాయకుడిగా నియమించుకొని వ్యాపారాన్ని నడుపుతున్నాడు. అధిక డబ్బులు సంపాదించాలనే ఆశతో హైదరాబాద్‌ నగరంపై కన్నేసిన వీరికి ప్రస్తుతం కెనడాలో ఉంటున్న హైదరాబాద్‌ వాసి సల్మాన్‌ ద్వారా అమీర్‌పేటలోని రచముత్సవ్‌ సంస్థ ఈవెంట్‌ మేనేజర్‌ రఫత్‌ మెహిదీ అలీఖాన్‌తో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది.

అప్పటి నుంచి ముంబైకి దాదాపు మూడుసార్లు వెళ్లి అలీఖాన్‌ మాదకద్రవ్యాలు తీసుకొచ్చాడు. అయితే అక్కడి నుంచి డ్రగ్స్‌ తీసుకురావడం ఇబ్బందవుతోందని చెప్పడంతో ఆ ముగ్గురూ ఆదివారం నగరంలోని కూకట్‌పల్లి వద్దనున్న భరత్‌నగర్‌ ప్రైడ్‌ ఆఫ్‌ హోటల్‌కు వచ్చారు. అప్పటికే అక్కడికి చేరిన అలీఖాన్‌ వారి నుంచి డ్రగ్స్‌ తీసుకుంటుండగా సనత్‌నగర్‌ పోలీసుల సహాయంతో మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ నలుగురి నుంచి ఒక్కో గ్రాము బరువు గల 31 కొకైన్, ఎండీఎంఏ, హెరాయిన్‌ ప్యాకెట్లతో పాటు ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ప్యాకెట్‌ మాదక ద్రవ్యాన్ని రూ.2,500 నుంచి రూ.5వేల వరకు కొనుగోలు చేసి నగరంలో రూ.10 వేల చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే అలీఖాన్‌ తమ సంస్థ తరపున నిర్వహించిన వివిధ ఈవెంట్లలో కస్టమర్లతో పరిచయాలు పెంచుకొని మాదకద్రవ్యాలు విక్రయించినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. విలేకరుల సమావేశంలో మాదాపూర్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ పురుషోత్తం, సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 

 పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, సెల్‌ఫోన్లు  

>
మరిన్ని వార్తలు