గోల్డ్‌కు హెన్నా టచ్‌!

16 Mar, 2019 02:42 IST|Sakshi
హెన్నాలో కలిపి తరలించిన బంగారం పౌడర్, పౌడర్‌ను కరిగించగా తయారైన బంగారం బిస్కట్‌

పసిడిని పౌడర్‌గా చేసి మెహెందీలో మిక్సింగ్‌ 

ఆర్‌జీఐఏలో ఇద్దరిని పట్టుకున్న డీఆర్‌ఐ టీమ్‌ 

రెండు కిలోలకు పైగా బంగారం స్వాధీనం

సాక్షి, హైదరాబాద్‌: హెన్నాతో(మెహెందీ పొడి) కలిపి, పేస్ట్‌లా మార్చి ఎవరికీ అనుమానం రాకుండా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా డెరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. ఇటీవలే పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌కు ఓ స్మగ్లర్‌ చిక్కగా తాజాగా శుక్రవారం డీఆర్‌ఐ అధికారులు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇద్దరిని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.71 లక్షల విలువైన రెండు కిలోలకుపైగా బంగారం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.  మస్కట్‌కు చెందిన సూత్రధారులు బంగారాన్ని మెత్తని పొడిగా చేశారు. దానిని గోధుమ రంగులో ఉన్న హెన్నాలో కలిపేశారు. ఇలా తన రంగును కోల్పోయి, పౌడర్‌ రూపంలోకి మారిన బంగారం, హెన్నా మిక్స్‌ను పేస్ట్‌గా మార్చడానికి చాక్లెట్‌ తయారీకి వినియోగించే ద్రావణాలను వాడారు. 

నడుముకు కట్టుకొని.. లోదుస్తుల్లో..
ఈ గోధుమరంగు పేస్ట్‌ను ప్లాస్టిక్‌ కవర్‌లో ప్యాక్‌ చేసిన స్మగ్లర్లు దాన్ని బ్రౌన్‌ కవర్లలో ఉంచి పైన ప్లాస్టర్లు వేశారు. ఇలా తయారు చేసిన రెండు ప్యాకెట్లలో ఒకదాన్ని ఒమన్‌ జాతీయుడు తన నడుముకు ఉన్న నల్లరంగు వస్త్ర బెల్టులో పెట్టి తీసుకురాగా, హైదరాబాద్‌వాసి తన లోదుస్తుల్లో దాచి తెచ్చాడు. వీరిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకొని తనిఖీ చేశారు. ఒమన్‌వాసి నుంచి 1,850 కిలోల పేస్టు, హైదరాబాదీ నుంచి 900 గ్రా ముల పేస్టును స్వాధీ నం చేసుకున్నారు. సూ త్రధారులు తనకు తెలియదని, కమీషన్‌ తీసు కుని హైదరాబాద్‌కు దీనిని చేరుస్తుంటానని నగరవాసి విచారణలో చెప్పాడు.

ఒమన్‌ జాతీయుడు మాత్రం తన స్నేహితుడి కోరిక మీదటే ఇలా చేశానని, ముఠాకు చెందిన రిసీ వర్లే తమ వద్దకు వచ్చి ప్యాకెట్లు తీసుకువెళ్తారని పేర్కొన్నాడు. డీఆర్‌ఐ అధికారులు  2,750 గ్రాముల పేస్ట్‌ను ఓ గిన్నెలో వేసి కిరో సిన్‌ పోసి నిప్పుపెట్టారు. ఈ మంటల ప్రభావానికి అది పొడిగా మారింది. ఈ పొడిని కొలిమిలో వినియోగించే గిన్నెలో వేసి కరిగించగా 2.136 కిలోల బంగారు బిస్కెట్లు తయారయ్యాయి. వీటి విలువ మార్కెట్‌లో రూ.70,82,669 ఉంటుందని అధికారులు తెలిపారు.   

మరిన్ని వార్తలు