అర్ధరాత్రి యాక్సిడెంట్‌

25 Sep, 2018 11:00 IST|Sakshi
ప్రమాదంలో ధ్వంసమైన ఆడి కారును తరలిస్తున్న దృశ్యం దర్శన్, ప్రజ్వల్, దేవరాజ్‌ (ఫైల్‌)

రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న  ఆడి కారు  

హీరో దర్శన్, దేవరాజ్, ప్రజ్వల్‌ దేవరాజ్‌కు గాయాలు 

మైసూరు వద్ద ప్రమాదం  

తారలకు తప్పిన పెనుముప్పు

అర్ధరాత్రి.. జోరున వర్షం, ఒక ఆడి కారు మైసూరు నుంచి బెంగళూరుకు బయల్దేరింది. కొన్ని నిమిషాల్లోనే కారు డివైడర్‌ను, దానిపైనున్న కరెంటు పోల్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో అక్కడున్న కొందరు కారులోనివారిని బయటకు తీసి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్నది ఎవరో కాదు..ప్రముఖ నటులు దర్శన్, దేవరాజ్, ప్రజ్వల్‌ దేవరాజ్‌. ముగ్గురికీ ఓ మోస్తరుగా గాయాలు తగిలాయి.  

మైసూరు: కారు అదుపు తప్పి బోల్తా పడడంతో శాండల్‌ఉడ్‌ హీరోలు దర్శన్, దేవరాజ్, దేవరాజ్‌ తనయుడు, హీరో ప్రజ్వల్‌ దేవరాజ్‌ లకు గాయాలు తగిలాయి. మైసూరు నగరంలోని జేఎస్‌ఎస్‌ అర్బన్‌హాత్‌ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దర్శన్‌ స్నేహితుడు, కారు డ్రైవర్‌ ఆంటోని రాయ్‌ కూడా గాయపడ్డాడు. స్థానికులు గమనించి బాధితులు దగ్గరిలోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షంలో కారు అదుపు తప్పడమే ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు.

ఎలా జరిగిందంటే..  
వివరాలు.. ఆదివారం నగరంలోని చామరాజేంద్ర జూ, ప్యాలెస్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో దర్శన్, ప్రజ్వల్‌లు పాల్గొనడం తెలిసిందే. అర్ధరాత్రి దాటాక దర్శన్‌కు చెందిన విలాసవంతమైన ఆడి క్యూ–7కారులో బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. కొంతసేపటికి అర్బన్‌హాత్‌ సమీపానికి చేరుకోగానే కారు అదుపు తప్పి డివైడర్‌పైనున్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. గమనించిన అర్బన్‌హాత్‌ భద్రతా సిబ్బంది వెంటనే స్థానికుల సహాయంతో నలుగురిని రక్షించి సమీపంలోని కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు. కారు బాగా దెబ్బతింది. ఈ ఘటనలో దర్శన్‌కు పక్కటెముకలకు గాయలయ్యాయి. దేవరాజ్‌కు ఎడమచేతి వేలికి, ఆంటోనీకి కాళ్లకు గాయాలు తగిలాయి. ప్రజ్వల్‌కు స్వల్ప గాయాలయ్యాయి.  

ఆస్పత్రికి అభిమానులు  
అందరూ సురక్షితమేనని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విషయం తెలుసుకున్న ఆయా నటుల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.  దర్శన్, ప్రజ్వల్‌ అభిమానులకు కూడా విషయం తెలిసి భారీగా తరలిరావడంతో ఆసుపత్రి వద్ద రద్దీ నెలకొంది. వారిని అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చిత్ర నిర్మాత సందేశ్‌ నాగరాజ్‌తో పాటు పర్యాటకశాఖ మంత్రి సారా మహేశ్,ఎమ్మెల్యే నాగేంద్ర,నటుడు సృజన్‌ లోకేశ్‌లు వెంటనే ఆసుపత్రికి తరలి అందరిని పరామర్శించారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.   

మరిన్ని వార్తలు