పరప్పన జైలుకు దునియా

25 Sep, 2018 10:51 IST|Sakshi
దునియా విజయ్‌ (ఫైల్‌)ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మారుతీగౌడ

26 వరకు రిమాండ్‌ 

బెయిల్‌ కోసం దరఖాస్తు

యశవంతపుర : జిమ్‌ శిక్షకుడు మారుతీగౌడపై దాడికి సంబంధించి హీరో దునియా విజయ్‌ని ఆదివారం అర్ధరాత్రి పోలీసులు పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈనెల 26 వరకు రిమాండ్‌కు పంపించారు. దీంతో జైలులో విజయ్‌కు 9035 నెంబర్‌ను కేటాయించారు. అయనతో పాటు డ్రైవర్‌ ప్రసాద్, జిమ్‌ శిక్షకుడు ప్రసాద్, కోచ్‌ మణిలకు ప్రత్యేక బ్యారక్‌ను కేటాయించారు. సోమవారం వీరికి వైద్య పరీక్షలను నిర్వహించారు.

నిరాశా, నిస్పృహల్లో దునియా :  జరిగిన సంఘటనతో దునియా తీవ్ర నిరాశలో ఉన్నట్లు సమాచారం. సినిమాల్లో కష్టపడి పైకొచ్చిన దునియా తనను కావాల్సి కుట్రలో ఇరికించినట్లు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉదయం 7 గంటలకు నిద్రలేచిన దునియా పులిహోర అల్పహారంగా తీసుకున్నారు.  

బెయిల్‌కు దరఖాస్తు  
దాడి కేసులో అరెస్టయిన దునియా విజయ్, అతని అనుచులు ఇక్కడి 8వ ఏసీఎంఎం కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేశారు. సోమవారం వాదనలు జరిగాయి. దునియాపై ఇప్పటికే రెండు క్రిమినల్‌ కేసులు ఉండటంతో అతనికి బెయిల్‌ మంజూరు చేయకూడదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు విన్నవించారు. బెయిల్‌ ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే దునియా, అతని అనుచరులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారని, ఇది కుట్రపూరితమైన కేసని నిందితుల తరఫున న్యాయవాది శివకుమార్‌ వాదించారు. 

హోంమంత్రిని కలిసిన పానీపురి కిట్టి
బాధితుడు మారుతిగౌడ చిన్నాన, పానీపూరి కిట్టి సోమవారం మారుతి గౌడ తల్లిదండ్రులతో కలిసి హోం మంత్రి పరమేశ్వర్‌ను కలిశారు. విద్వత్‌ కేసులో పీపీగా పనిచేసిన శ్యామ్‌ సుందర్‌కు ఈ కేసును అప్పగించాలని కోరారు. తన అన్న కుమారుడు మారుతి పెదవికి 14 కుట్లు పడ్డాయని హోం మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఆయనకు బుద్ధి చెప్పేవారే లేరా ? 
తన భర్త దునియా విజయ్‌కు మంచి సలహాలు ఇచ్చేవారు లేకనే ఆయన పలుమార్లు జైలుకు వెళ్లినట్లు ఆయన మొదటి భార్య నాగరత్న ఆరోపించారు. ఇలా తరచూ జైలుకు వెళ్తాఉంటే పిల్లలు భవిష్యత్‌ ఏమిటని ఆమె ఆందోళన వ్యక్త పరిచారు.దునియా విజయ్‌ రెండో భార్య మోజులోపడి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని, తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే విజయ్‌ రెండో భార్య కీర్తి సోమవారం మధ్యాహ్నం పరప్పన అగ్రహార జైలుకు వచ్చారు. దునియాను కలిసేందుకు ఆమెకు అవకాశం లభించలేదు.  

మరిన్ని వార్తలు