చిత్రరంగంలో రాణించలేక మోసాలు..!

13 Jan, 2018 08:36 IST|Sakshi

సాక్షి, చెన్నై : తాను చిత్రరంగంలో రాణించలేకనే మోసాలకు పాల్పడినట్లు ఫేస్‌బుక్‌తో పలువురు యువకులను మోసగించిన శ్రుతి శుక్రవారం వెల్లడించింది. ఫేస్‌ బుక్‌లో తన అందమైన ఫొటోలు పెట్టి పలువురి వద్ద శ్రుతి రూ.1.50 కోట్లు దోచుకున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ముగ్గురు సాప్ట్‌వేర్‌ ఇంజినీర్లను బురిడీ కొట్టించిన శ్రుతి అనే యువతి తన తల్లి, సోదరుడు, స్నేహితుడు సహా ఊచలు లెక్కపెడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. 

అందమైన ఫొటోలను ఎరవేసి..
సేలం జిల్లా ఎడపాడికి చెందిన బాలకృష్ణన్‌ (29) విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఆన్‌లైన్‌లో పెళ్లి సంబంధాలు వెతుకుతున్న ఇతనికి కోయంబత్తూరు పాపనాయకన్‌పాళైకి చెందిన శ్రుతి (21) ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది. సినిమా నటిలా ఫోజులిస్తూ ఫొటోలు పెట్టడం, ఇంగ్లిషులో మాట్లాడడంతో బాలకృష్ణన్‌ ప్రేమలో పడిపోయాడు. దీనిని అవకాశంగా తీసుకున్న శ్రుతి.. తన తల్లి చిత్ర మెదడులో గడ్డ ఉందని, వెంటనే ఆపరేషన్‌ చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రుతి మాటలు నమ్మిన బాలకృష్ణన్‌ రూ.5 లక్షలను ఆమె బ్యాంకు ఖాతాలో వేశాడు. కొన్ని రోజుల తరువాత ఇంటిపై అప్పు ఉందని, తీరిన తరువాతనే పెళ్లి అని చెప్పడంతో కాబోయే భార్యే కదాని మరో రూ.45 లక్షలు పంపాడు.

ఈ నేపథ్యంలోనే శ్రుతి ఫొటోలను చెన్నైలోని తన ప్రాణస్నేహితునికి పంపి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. వెంటనే గుర్తించిన అతను ఆమె పెద్ద మోసగత్తెని తెలిపాడు. దీంతో బాలకృష్ణన్‌ వెంటనే శ్రుతికి ఫోన్‌ చేసి నిలదీయడంతో కట్‌ చేసి ఏకంగా స్విచ్‌ ఆఫ్‌ చేసేసింది. తాను మోసపోయానని గ్రహించిన బాలకృష్ణన్‌ కోయంబత్తూరుకు చేరుకుని సైబర్‌ క్రైంబ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా శ్రుతి చిదంబరానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరుళ్‌కుమార్‌ గురురాజా నుంచి రూ.50లక్షలు, నామక్కల్‌ జిల్లా పరమత్తివేలూరుకు చెందిన సంతోష్‌కుమార్‌ అనే సాప్ట్‌వేర్‌ ఇంజినీరు నుంచి రూ.43 లక్షలు.. దండుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రుతితో పాటు ఆమెకు సహకరించిన తల్లి చిత్ర (48), సోదరుడు సుభాష్‌ (18) బంధువు వెంకటేష్‌ (38), స్నేహితుడు శబరినా«థ్‌ (23)లను బుధవారం రాత్రి సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చిత్రసీమలో రాణించలేకపోవడంతో ..
శ్రుతి ఆడి పోనాల్‌ ఆవణి అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ చిత్రం ఇంకా విడుదల కాలేదు. సినిమాలో రాణించలేకపోవడంతో నిరాశ చెందిన శ్రుతి తన తల్లి సహకారంతో ధనవంతులైన యువకులకు లోబరచుకుని కోట్లాది రూపాయలు మోసగించింది. విలాస జీవితానికి అలవాటు పడడమే దీనికి కారణం. శ్రుతి, ఆమె తల్లి సహకారంతో ఎనిమిది మంది యువకులను ప్రేమ వలతో మోసగించినట్లు తెలిసింది. దీంతో వారిద్దరూ ఈ విధంగానే చాలా మంది యువకులను మోసగించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా వీరి మోసంలో పలువురికి సంబంధం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం శ్రుతిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపేందుకు నిర్ణయించారు. కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి అనుమతి పొందేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు