బెడిసికొట్టిన గుప్తనిధుల వేట!

20 Feb, 2020 11:02 IST|Sakshi
తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న మెకానిక్‌ గడ్డూరు గణేష్‌

వన్యప్రాణుల వేటకు అమర్చిన కరెంటు తీగలు తగిలి ఇద్దరికి షాక్‌

ఇంటిపై కరెంట్‌ షాక్‌ కొట్టిందంటూ ఆస్పత్రిలో చేరిక

మరో వ్యక్తికి తమిళనాడులో చికిత్స..?

గుప్తనిధుల వేటకు వెళ్లిన ముఠాలో మొత్తం 8 మంది

ప్రస్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు

పలమనేరు: గుప్తనిధుల కోసం వెళితే కరెంటు షాక్‌ కొట్టి లబోదిబోమన్నారు. పక్కాగా స్కెచ్‌ వేసినా వన్యప్రాణులను హతమార్చేందుకు వేటగాళ్ల అమర్చిన కరెంటు తీగల కారణంగా ప్లాన్‌ బెడిసి కొట్టింది. ఎనిమిదిమంది ముఠాలో ముగ్గురు కరెంటు షాక్‌ కొట్టింది. చివరకు తేలుకుట్టిన దొంగల్లా ఆస్పత్రిలో చేరారు.  అయితే ఇంటిమీద కరెంటు షాక్‌ కొట్టిందంటూ కహానీలు చెప్పినా పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు బైటపడ్డాయి. బుధవారం ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది.   పోలీసులు, స్థానికులు, ప్రస్తుతం పోలీసుల అదుపులోఉన్న వారు తెలిపిన వివరాల మేరకు... పకీర్‌పల్లె, చెన్నుపల్లె సమీపాన
దొడ్డిపల్లె బీట్‌లోని లక్ష్మప్ప చెరువులో గుప్తనిధులున్నాయని ఎప్పటినుంచో పుకార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలమనేరు మండలం కూర్మాయికి చెందిన హరీష్‌రెడ్డి, పట్టణంలోని గడ్డూరు కాలనీకి చెందిన మెకానిక్‌ గణేష్, ఇతని బంధువు పకీర్‌పల్లెకు చెందిన ఆటోడ్రైవర్‌ రమేష్, కాబ్బల్లికి చెందిన గంగిరెడ్డి, బైరెడ్డిపల్లె మండలం చప్పిడిపల్లెకు చెందిన గురు, చౌడేపల్లె, అంగళ్లు ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరితోపాటు తమిళనాడు రాష్ట్రం చెన్నెకి చెందిన జయరామ్‌ స్వామీజీ గుప్తనిధుల కోసం స్కెచ్‌ వేశారు. దీనికయ్యే ఖర్చును హరీష్‌రెడ్డిపై మోపడంతో అతను వారం రోజులుగా స్థానిక మదనపల్లె రోడ్డులోని ఓ లాడ్జిలో స్వామీజీని దింపాడు. గత గురువారం ఈ ముఠా అడవిలోకి గుప్తనిధులున్న ప్రాంతానికి వెళ్లి రెక్కీ నిర్వహించింది. ఆపై పక్కాగా ప్లాన్‌ చేసుకుని శనివారం రాత్రికి అక్కడ ప్రత్యేక పూజలు చేసి నిధుల కోసం తవ్వకం పనులకు పూనుకోవాలని నిర్ణయించారు.

శనివారం రాత్రి 8 గంటలకు ఆపరేషన్‌ ఇలా....
ఆటోడ్రైవర్‌ రమేష్‌ ఆటోలో గణేష్‌ గునపం, పార వేసుకుని రెక్కమాను సర్కిల్‌లో నలుగురిని ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆపై స్వామీజీ జతకలిశాడు. వీరు స్థానిక పెద్దచెరువు కట్టపైకి రాగానే స్కూటీలో ఇదే ముఠాలోని ఇద్దరు కలిశారు. ఆ తర్వాత అందరూ  అడవి సమీపంలోకి రాత్రి 9.30కు చేరుకున్నారు. ఆటో వెళ్లేందుకు దారిలేకపోవడంతో అక్కడి మామిడితోపులో ఆటోను ఆపి కాలినడకను వీరు బయలుదేరారు. అడవికి దగ్గర్లోనే వన్యప్రాణులను హతమార్చేందుకు వేటగాళ్లు కరెంటు తీగలను అమర్చిన విషయం తెలియక ముందువెళుతున్న గణేష్, అతని వెనుకనున్న జయరామ్, స్వామీజీ కరెంటు షాక్‌కు గురై గాయపడినట్టు తెలిసింది. ఇందులో గణేష్‌కు ఎక్కువగా గాయాలయ్యాయి.దీంతో ముఠా అదే ఆటోలో పలమనేరుకు చేరుకుంది. విషయం తెలిసి గణేష్‌ అన్న సురేష్‌ వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్చాడు. వారు ఇంటిపై కరెంట్‌ షాక్‌ కొట్టిందంటూ ట్రీట్‌మెంట్‌ పొందారు. శనివారం రాత్రే తిరుపతి రుయా ఆస్పత్రికి వెళ్లి, అక్కడ కూడా ఇదే స్టోరీ చెప్పి, చికిత్స పొందారు. అయితే స్వామీజీ మాత్రం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం ప్రస్తుతం తమిళనాడులో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.

నరబలికోసమేనట..!
తనకే పాపం తెలియదని, తనను పార, గునపం తీసుకురమ్మంటే తీసుకుని వారితో వెళ్లానని, అడవిలోకి వెళ్లాక తనకేమైందో అర్థం కాలేదని గడ్డూరుకు చెందిన గణేష్‌ మీడియాకు తెలిపాడు. గుప్తనిధులకోసం పూజలు చేసేటపుడు తనను కావుగా బలిచ్చేందుకు తీసుకెళ్లి ఉంటారని, తనపై యాసిడ్‌ పోశారని కూడా పేర్కొనడం గమనార్హం!

మిస్టరీగా మారిన వైనం
ఇదే విషయం పలమనేరు ఎస్‌ఐ నాగరాజును వివరణ కోరగా.. సంబంధిత వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇందులో ముగ్గురి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. కరెంటు షాక్‌కు గురవడంతోనే తాము వారిని వెనక్కి తీసుకొచ్చామని నిందితులు ప్రాథమిక విచారణలో చెప్పినట్టు ఎస్‌ఐ తెలిపారు. గణేష్‌ మాటల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. సంఘటన స్థలానికి 300 అడుగుల దూరంలో వ్యవసాయ మోటార్లున్నాయని, అక్కడినుంచి కరెంటు తీగలను లాగారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మిస్టరీని త్వరలోనే ఛేదిస్తామని  ధీమాగా తెలిపారు.

మరిన్ని వార్తలు