‘కలెక్టర్లు’ ఏరివేత మొదలైంది ఇక్కడే.. 

9 Jun, 2018 16:01 IST|Sakshi

మూడింటిలోనూ సిటీలోనే తక్కువ వసూల్‌ రాజాలు 

తీవ్రంగా పరిగణిస్తున్న ఉన్నతాధికారులు 

రెండేళ్ల క్రితమే చర్యలు తీరు మారకపోవడంపై ఆగ్రహం 

బాధ్యులపై కఠిన చర్యలకు సన్నాహాలు

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు విభాగానికి సంబంధించి వసూల్‌ రాజాలు రాష్ట్ర వ్యాప్తంగా 391 మంది ఉన్నారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల హైదరాబాద్‌ పరిధిలోనే తక్కువ మంది ‘కలెక్టర్లు’ పని చేస్తున్నారు. అయినప్పటికీ ఉన్నతాధికారులు సిటీ అధికారుల వ్యవహారశైలిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. నగరంలో రెండేళ్ల క్రితమే ‘కలెక్టర్ల’ను బదిలీలు చేసినప్పటికీ, దందాలు వద్దని స్పష్టం చేసినప్పటికీ ఇంకా కొనసాగడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నా రు. ఈ అవినీతి వ్యవహారాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

ఏరివేత మొదలైంది ఇక్కడే... 
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి సిబ్బంది, అధికారుల అవినీతిపై దృష్టి పెట్టారు. స్టేషన్‌ ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా రూ. 75 వేలు మంజూరు చేస్తున్న ఆయన ‘కలెక్షన్స్‌’ విధానాన్ని పారదోలాలని భావించారు. దీంతో 2015 లోనే అవినీతి నిరోధక చర్యలు ప్రారంభించిన ఆయనసిటీలో ఉన్న వసూల్‌ రాజాలపై దృష్టి పెట్టారు. నగర నిఘా విభాగమైన స్పెషల్‌ బ్రాంచ్‌ ద్వారా లోతుగా ఆరా తీయించి, దాదాపు 100 మందితో కూడిన జాబితానురూపొందించారు. వీరిని సిటీ ఆర్డ్మ్‌ రిజర్వ్‌ విభాగానికి బదిలీ చేయించారు. దాదాపు రెండేళ్ల క్రితమే ఏరివేత మొదలైనా ఇప్పటికీ కలెక్టర్లు ఉండటాన్ని, బదిలీ అయిన వారూ తమ హవా నడిపించడాన్నీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. మిగిలిన కమిషనరేట్లు, జిల్లాల్లో కంటే ప్రక్షాళన చేసినప్పటికీ సిటీలో వసూల్‌ రాజాల
వ్యవస్థ కొనసాగడం పోలీసు ఉన్నతాధికారుల్ని కలవరపెడుతోంది.  

ఎస్సైల కోసమూ వసూళ్లు... 
రాచకొండలో 24, సైబరాబాద్‌లో 13 మంది కలెక్టర్లు ఉండగా... హైదరాబాద్‌లో ఈ సంఖ్య 11గా ఉంది. సిటీలో మొత్తం 60 ఠాణాలు ఉండగా.. ఎనిమిదింటిలోనే ఈ కలెక్టర్ల విధానం కొనసాగుతోంది. సాధారణంగా ఈ కలెక్టర్లు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లుగా వ్యవహరించే ఇన్‌స్పెక్టర్లు, డివిజన్లకు నేతృత్వం వహించే ఏసీపీల కోసం పని చేస్తుంటారు. వారి ఆదేశాలు, సూచనల మేరకు వసూళ్లకు పాల్పడతారు. అయితే నగరంలోని కొందరు కలెక్టర్లు సబ్‌–ఇన్‌స్పెక్టర్ల కోసమూ పని చేస్తుండటం కొసమెరుపు. ప్రధానంగా వైన్‌షాపులే పోలీసులకు ఆదాయ వనరులుగా మారాయి. వారు చేస్తున్న ఉల్లంఘనలు, అతిక్రమణలను పట్టించుకోకుండా వదిలేయడం, చర్యలు తీసుకోకుండా పరోక్షంగా సహకరించడం కోసమే వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత కల్లు దుకాణాలు, అర్ధరాత్రి వరకు నడిచే హోటళ్లు, వ్యాపార సంస్థలు, బిల్డర్స్‌ నుంచి కలెక్టర్లు నెల వారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయాలు, గోదాముల వద్ద వసూలు చేయడానికి ఏకంగా ఓ ఏఎస్సై స్థాయి అధికారే కలెక్టర్‌గా మారిపోయారు. 

బదిలీ అయినా ‘పట్టు’ తప్పకుండా... 
వసూల్‌ రాజాలనే ఆరోపణలతో బదిలీ అయిన సిబ్బంది సైతం ఆయా ఠాణాల పరిధిలో తమ ‘పట్టు’ సడలకుండా జాగ్రత్త పడుతున్నారు. పశ్చిమ మండల పరిధిలోని ఓఠాణాకు కలెక్టర్‌గా వ్యవహరించిన హెడ్‌–కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు గతంలో సీఏఆర్‌ హెడ్‌–క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. అయినా తన పంథా మార్చుకోని, ‘పట్టు’ సడలనివ్వని ఈ కలెక్టర్‌ తన ఏజెంట్‌ను రంగంలోకి దింపాడు. అదే ఠాణాలో సెక్షన్‌ డ్యూటీ నిర్వహిస్తున్న ఓ హోంగార్డు ద్వారా వసూళ్లు కొనసాగిస్తున్నాడని తాజా పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. ఇదే జోన్‌లోని మరో ఠాణాలో ఏకంగా గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్స్‌ కానిస్టేబులే కలెక్టర్‌గా మారిపోయాడు. నగరంలో ఉన్న కలెక్టర్లలో నలుగురు హోంగార్డులు, ఐదుగురు కానిస్టేబుళ్ళు, ఒక హెడ్‌–కానిస్టేబుల్, ఓ ఏఎస్సై ఉన్నారు.  

ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు...
ఈ కలెక్టర్ల వ్యవహారం వెలుగులోకి రావడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు అప్రమత్తమయ్యారు. ఎవరైనా పోలీసులు మామూళ్లు డిమాండ్‌ చేస్తే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా వాట్సాప్‌ నెంబర్లు, ఈ–మెయిల్‌ ఐడీలు ఏర్పాటు చేశారు. ఇలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తున్నారు. 

హైదరాబాద్‌: 9490616555, ( cphydts@gmail.com)
సైబరాబాద్‌: 9490617444, (cpcybd@gmail.com)
రాచకొండ: 9490617111, ( cp@rck.tspolice.gov.in)

మరిన్ని వార్తలు