హైటెక్‌ మోసం 

18 Jan, 2020 08:49 IST|Sakshi
హైటెక్‌ బస్సును సీజ్‌ చేసిన ఎంవీఐ శివప్రసాద్, సిబ్బంది

నకిలీ నంబరుతో తిరుగుతున్న హైటెక్‌ బస్సు  

అమలాపురం టౌన్‌: అది ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని గోరక్‌పూర్‌ కేసీ జైన్‌ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు హైటెక్‌ బస్సు.. అయితే ఇదే బస్సు ఆంధ్రప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌తో నకిలీ నంబరుతో మన రాష్ట్రంలో పన్ను ఎగవేస్తూ అక్రమ ట్రాన్స్‌పోర్ట్‌ చేస్తోంది. ఎదుర్లంక–హైదరాబాద్‌ మధ్య ట్రావెల్స్‌ నిర్వహిస్తోంది. అమలాపురం కలశం సెంటరులో గురువారం రాత్రి 9 గంటలకు ఈ నకిలీ నంబరుతో ఉన్న హైటెక్‌ బస్సు రోడ్డుపై నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న సమయంలో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కేవీ శివప్రసాద్‌ తన సిబ్బందితో ఆకస్మిక దాడి చేసి ఆ బస్సు రికార్డులను తనిఖీ చేశారు. బస్సు వాస్తవ రికార్డుల ప్రకారం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం రిజి్రస్టేషన్‌ నంబర్‌ యూపీ 53 ఎఫ్‌టీ 3509గా ఆయన గుర్తించారు. అయితే ఇదే బస్సు ఆంధ్రప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌ నంబరు ఏపీ07 టీజీ 0222ను పెట్టుకుని అక్రమ సర్వీస్‌ చేస్తున్నట్లు గమనించారు.

ఏపీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఇదే నంబరు గల హైటెక్‌ బస్సు కాకినాడ నుంచి రిజిస్ట్రేషన్‌ అయినట్లు కూడా శివప్రసాద్‌ గుర్తించారు. అంటే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన బస్సు మన రాష్ట్రానికి చెందిన వేరే హైటెక్‌ బస్సు నంబర్‌ను పెట్టుకుని కోనసీమలోని ఎదుర్లంక నుంచి హైదరాబాద్‌కు సర్వీసు నడుపుతోంది. ఎంవీఐ శివప్రసాద్‌ అమలాపురంలో బస్సును తనిఖీ చేసేసరికి అందులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వేరే నంబరుతో అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆధారాలతో గుర్తించిన ఆయన బస్సును తక్షణమే సీజ్‌ చేశారు. అంతే గాకుండా ఆ బస్సుకు చెందిన ఇద్దరు డ్రైవర్లను బైండోవర్‌ చేశారు. రికార్డులను స్వాదీ నం చేసుకున్నారు. అయితే ఏపీ నంబర్‌తో తిరుగుతున్నప్పటికీ ఎక్కడా టాక్స్‌ చెల్లించిన దాఖలాలు లేకపోవడంతో గవర్నమెంట్‌ టాక్స్‌ ఎగవేతకు ఉద్ధేశపూర్వకంగానే అనుమ తి లేకుండా సర్వీసు నడుతున్నట్లు అంచనాకు వచ్చారు. సీజ్‌ చేసిన హైటెట్‌ బస్సును స్థానిక ఆర్టీసీ డిపోకు తరలించారు. బస్సు డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో ఆ బస్సు యాజమాని పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. 

మరిన్ని వార్తలు