కరోనా రోగి అంత్యక్రియలు అడ్డుకున్నందుకు కేసు నమోదు

27 May, 2020 15:10 IST|Sakshi

సిమ్లా: కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకున్నందుకు గాను సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడితో పాటు ముగ్గురు కౌన్సిలర్లు, మరో 16 మంది మీద హిమాచల్‌ప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌ నాయకుడిని మండి జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుమన్‌ చౌదరిగా గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కరోనాతో మృతి చెందింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడం కోసం అంబులెన్స్‌లో శ్మశానవాటికకు తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్‌ నాయకుడు కాన్సా, తన్వా గ్రామాల ప్రజలతో కలిసి రోడ్డుకు అడ్డంగా బైఠాయించి అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. దాంతో సుమన్‌ చౌదరితో పాటు మిగతా వారిపై అంటు వ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేశాం’’ అన్నారు పోలీసులు. 

సుమన్‌ చౌదరి చర్యల వల్ల కాంగ్రెస్‌ పార్టీ ఇరకాటంలో పడింది. ఓ వైపు కాంగ్రెస్‌ నాయకులు కరోనాను ఓడించండి.. మానవత్వాన్ని బతికించండి అంటూ ప్రచారం చేస్తుండగా.. మరో వైపు సుమన్‌ చౌదరి కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరిన్ని వార్తలు