గురువే... పశువై..

24 Nov, 2019 04:30 IST|Sakshi
పోలీసుల అదుపులో ప్రసాద్‌రావు, సారథి దంపతులు

హాస్టల్‌లోని బాలికపై హెచ్‌ఎం పలుమార్లు అత్యాచారం

రెండేళ్ల తర్వాత వెలుగుచూసిన దారుణం

పెద్దఅంబర్‌పేట: తల్లిదండ్రుల తర్వాత కంటికిరెప్పలా కాపాడుతూ విద్యాబుద్ధుల్ని నేర్పించాల్సిన గురువే పశువయ్యాడు. చదువుకునేందుకు తన వద్దకు వచ్చిన ఓ విద్యార్థినిపై కన్నేసి గురువు పదానికే కళంకం తెచ్చాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. భార్య సహకారంతో ఓ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కీచక దంపతుల చెరనుంచి తప్పించుకుని బయటపడిన బాలిక ఈ విషయాన్ని బయటకు చెబితే ఏమవుతుందోనన్న భయంతో రెండేళ్లపాటు మౌనాన్ని ఆశ్రయించింది. ఆతర్వాత జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో చెప్పి వారి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణా పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండ లం బాటసింగారం గ్రామంలో ఉన్న జానెట్‌ జార్జి మెమోరియల్‌ రెసిడెన్షియల్‌(ప్రైవేట్‌) పాఠశాలలో కొలవెంటి ప్రసాద్‌రావు(51) ఇన్‌చార్జి హెచ్‌ఎంగా, అతని భార్య సారథి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

ఈ పాఠశాలలో 2017లో 8వ తరగతి చదుతున్న ఓ బాలిక(15)పై హెచ్‌ఎం ప్రసాద్‌రావు కన్నేశాడు. తరచూ రాత్రి సమయాల్లో బాలిక ఉంటున్న గదికి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు.వారానికి ఒకటి, రెండుసార్లు తన గదిలోకి పిలు చుకుని అత్యాచారం చేసేవాడు. దీనికి ప్రసాద్‌రావు భార్య సారథి సహకరిస్తుండేది. దంపతుల మాట వినకపోతే ఇంటి పనులు చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చేవారు. ఈ క్రమంలో హాస్టల్‌ నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. కుటుంబీకులు, బంధువుల సహకారంతో శుక్రవారం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, షీటీం సాయంతో హాస్టల్‌పై దాడి చేసి ప్రసాద్‌రావు దంపతులను అరెస్టు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బాధితులు తక్షణమే రాచకొండ పోలీస్‌ వాట్సాప్‌ నంబర్‌: 94906 17111 లేదా 100 నంబర్లను సంప్రదించాలని సీపీ సూచించారు.  బాలికపై అత్యాచారానికి పాల్పడిన ప్రసాద్‌రావుకు ఉరిశిక్ష విధించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు